Tirupati: ఒకే పోలీస్టేషన్ పరిధిలో మూడు మిస్సింగ్ కేసులు.. మిస్టరీగా మారిన వ్యవహారం
ఒకే పోలీస్టేషన్‌లో మూడు మిస్సింగ్ కేసులు.. ఆ పోలీస్టేషన్‌లోనే ఎందుకు జరుగుతున్నాయి?. ఒక్క తిరుపతిలోనే నాలుగు అదృశ్యం కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఇందులో ఇద్దరు మైనర్లు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. మిస్సింగ్ కేసుల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి ?
AP News: ఆధ్యాత్మిక నగరంలో అదృశ్యం కేసులు కలకలం రేపుతున్నాయి. ఒకే రోజులో నాలుగు మిస్సింగ్ కేసులు నమోదు కావడంతో తిరుపతి వాసులు ఆందోళన చెందుతున్నారు. అటు పోలీసులు కూడా అదృశ్యమైన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతిలోని అలిపిరి పోలీస్టేషన్(Alipiri Police Station) పరిధిలో మూడు మిస్సింగ్ కేసులు, ఈస్ట్ పోలీస్టేషన్‌లో మరో అదృశ్యం కేసు నమోదయ్యాయి. ఒకేరోజు నాలుగు మిస్సింగ్ కేసులు నమోదు కావడంతో అటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అదృశ్యం అయిన వాళ్లంతా ఎక్కడికెళ్లారు ? ఎందుకు వెళ్లారు? వీరిని ఎవరైనా కిడ్నాప్ చేశారా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
అలిపిరి పోలీస్టేషన్ పరిధిలో రేణుకా అనే వివాహిత మిస్సింగ్‌పై ఆమె పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళంలో నివాసం ఉంటున్న అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ప్రసాద్ కూతురు రేణుకకు 2019లో వివాహం జరిగింది. నంద్యాల నీటిపారుదలశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహేశ్వర్‌కు రేణుకను ఇచ్చి వివాహం చేశారు ప్రసాద్ దంపతులు. అయితే రేణుక ఆచూకీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అల్లుడు ఆన్‌లైన్ గేములకు, క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసై అప్పుల పాలయ్యాడని ప్రసాద్ దంపతులు తెలిపారు. దాదాపు 35 లక్షల వరకు అప్పు చేశాడని చెబుతున్నారు. గత నెల 25న తిరుపతికి తన కూతురును తీసుకొచ్చిన అల్లుడు మళ్లీ తిరిగి రాకపోగా, మే 31 మధ్యాహ్నం నుంచి తమ కూతురు రేణుక కూడా అదృశ్యం అయిందని పేరెంట్స్ చెబుతున్నారు. సీసీటీవీలో రేణుక వెళ్లిపోయిన దృశ్యాల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రేణుక తన దగ్గరే సేఫ్‌గా ఉందని మెస్సేజ్ పెట్టిన అల్లుడు ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేశాడని ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు అలిపిరి పోలీస్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసుల్లో ఇద్దరు మైనర్లున్నారు. సత్యనారాయణపురానికి చెందిన రవీంద్రబాబు కూతురు మోనీషా అదృశ్యమైనట్టు పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. విజయవాడలోని చైతన్యకాలేజీలో జూనియర్ ఇంటర్ చదువుతున్న ఈ మధ్యనే ఎగ్జామ్స్ రాసింది. ప్రస్తుతం ఇంటి దగ్గర ఉంటున్న మోనీషా.. తల్లిదండ్రులు గుడికి వెళ్లి వచ్చేలోగా కనిపించకుండాపోయింది. దీంతో పేరెంట్స్ ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
అటు చెన్నారెడ్డికాలనీలో మరో మిస్సింగ్ కేసు నమోదైంది. 13 ఏళ్ల వంశీకృష్ణ అదృశ్యమయ్యాడు. 8వ తరగతి చదువుతున్న వంశీకృష్ణ ఐస్‌క్రీమ్ కోసం వెళ్లి తిరిగి రాలేదు. మరోవైపు ఈస్ట్ పోలీస్టేషన్ పరిధిలో మరో మిస్సింగ్ కేసు నమోదైంది. నగరి పోస్టాఫీస్ వీధికి చెందిన వివేక్ గత నెల 22న తిరుపతి వెళ్లి తిరిగి రాలేదని తల్లి విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నేహితుడి బర్త్ డే కోసం తిరుపతి వచ్చిన వివేక్ ఏమయ్యాడో తెలియక అతడి తల్లి ఆందోళన చెందుతున్నారు. వివేక్ స్నేహితులపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది విజయలక్ష్మి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..