Chittoor Murder Case: ఆత్మహత్య కాదు హత్యే.. సీఐ, ఎస్ఐ సహా ముగ్గురిపై సస్పెన్షన్ వేటు..
Renigunta Murder Case: హత్య కేసును ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన పోలీసులపై వేటు పడింది. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది.
Renigunta Murder Case: హత్య కేసును ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన పోలీసులపై వేటు పడింది. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. ఈ మేరకు చిత్తూరు జిల్లాలోని రేణిగుంట రూరల్ సిఐ అమర్నాథ్ రెడ్డి, వడమాలపేట ఎస్ఐ చిరంజీవి, కానిస్టేబుల్ శోభనాద్రిలను సస్పెన్షన్ చేస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాంచంద్రాపురం పీఎస్ పరిధి అనుపల్లిలో ఫిబ్రవరి 6న జరిగిన హేమసుందర్ హత్య కేసును పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నెలరోజుల తరువాత స్పందన కార్యక్రమంలో పోలీసుల తీరుపై తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడును కలిసి ఫిర్యాదు చేసింది హేమసుందర్ భార్య ఉమా మహేశ్వరి. ఆస్తి కోసం తన భర్తను హత్య చేశారని ఫిర్యాదు చేసింది. ఘటనపై సాక్ష్యాధారాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని ప్రత్యేక పోలీసు బృందాన్ని ఆదేశించారు ఎస్పీ వెంకట అప్పలనాయుడు. కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
అయితే.. ఉమామహేశ్వరి ఆరోపణలు నిజమని తేలడంతో సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్‌పై ఎస్పీ చర్యలు తీసుకున్నారు. అనంతపురం రేంజ్ డీఐజీ వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలో పనిచేస్తూ నిందితులను బలపరచడం, నమ్మక ద్రోహం చేయడం, అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్పీ. అసలేం జరిగిందని ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులు అరాతీస్తున్నారు. హత్య కేసును ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించారు? బాధితుడికి పోలీసులకు ఉన్న లింకేంటి? ఇందులో ఇంకా ఎవరి ప్రమేయం ఉంది? నిందితులను తప్పించేందుకే ఇలా ప్లాన్ వేశారా? అన్న కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.
Also Read: