Tirupati: పుట్టినరోజు శ్రీవారి దర్శనం అయ్యింది – తిరిగి ఇంటికి చేరే లోపే మృత్యువు కబళించింది

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కల్ రోడ్డు పల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దర్ని బలితీసుకుంది. కారు కల్వర్టును ఢీకొనడంతో.. మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న దంపతులు మృతి చెందగా.. వారి ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.

Tirupati: పుట్టినరోజు శ్రీవారి దర్శనం అయ్యింది - తిరిగి ఇంటికి చేరే లోపే మృత్యువు కబళించింది
Car Accident

Edited By:

Updated on: Jun 22, 2025 | 6:17 PM

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కల్ రోడ్డు పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకెళ్లిన కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఘటనలో కారులో మంటలు వ్యాపించి.. పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న సిద్దయ్య (ఎక్స్-సర్వీస్ మెన్), ఆయన భార్య జ్యోతిలక్ష్మి మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెనుక సీట్లలో ఉన్న వారి పిల్లలను స్థానికులు గమనించి.. బయటకు లాగి రక్షించారు. వారిని తిరుపతి స్విమ్స్‌కు తరలించారు.

సిద్దయ్య, జ్యోతిలక్ష్మి గుడిపాల మండలం కుప్పిగానిపల్లికి చెందినవారు. సిద్దయ్య వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. ఆదివారం ఆయన పుట్టిన రోజు కావడంతో కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. దంపతుల కుమారుడు గిరిసాయికి తీవ్ర గాయాలు అవ్వడంతో.. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి నుంచి వేలూరు సీఎంసీకి తరలించారు. కుమార్తె గాయత్రికి కాలు విరగడంతో చికిత్స అందిస్తున్నారు.

ఈ దారుణ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కుటుంబంలో ఇద్దరిని కోల్పోవడంతో వారి సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు. చెవిరెడ్డి కుటుంబసభ్యులు కూడా ఘటన స్థలానికి చేరుకొని బాధితులను ఓదార్చే ప్రయత్నం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..