తిరుమలలో పాములు కనిపిస్తే చంపొద్దు.. ఇలా చేయాలంటున్న నిపుణులు
తిరుమలలో పాములు కనిపిస్తే వాటిని చంపకుండా శిక్షణ పొందిన సిబ్బందితో సురక్షితంగా రెస్క్యూ చేసి సహజ ఆవాసాల్లోకి తరలించాలని సంగమిత్ర యానిమల్ ఫౌండేషన్ ప్రతినిధి ఎం. ఇంద్రీస్ సూచించారు. పర్యావరణ సమతుల్యతలో పాముల పాత్ర కీలకమని తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..

తిరుమలలో పాములు కనిపిస్తే భయంతో వాటిని చంపాల్సిన అవసరం లేదని సంగమిత్ర యానిమల్ ఫౌండేషన్ ప్రతినిధి ఎం. ఇంద్రీస్ సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పాములు కీలక పాత్ర పోషిస్తాయని, వాటిని సురక్షితంగా రెస్క్యూ చేసి సహజ ఆవాసాల్లోకి తరలించాలని చెప్పారు. అయితే సర్పాల సంరక్షణతోపాటు భక్తులు, సిబ్బంది భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. తిరుపతిలోని శ్వేత ఆధ్వర్యంలో టీటీడీ ఉద్యోగులకు సర్పాల రెస్క్యూ, వృక్ష సంరక్షణపై మంగళవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాములను గుర్తించడం, వాటి ప్రవర్తనను అర్థం చేసుకోవడం, విషపూరిత సర్పాలను గుర్తించడం, సురక్షితంగా రెస్క్యూ చేయడం వంటి అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
పాములు ఎందుకు ముఖ్యమంటే..
పాములను భయంతో శత్రువులుగా చూడటం సరికాదని ఇంద్రీస్ అన్నారు. ముఖ్యంగా ఎలుకలు, ఇతర హానికర జీవుల సంఖ్యను నియంత్రించడం ద్వారా పాములు ప్రకృతి సమతుల్యతకు దోహదపడతాయని వివరించారు. జనావాసాల్లోకి లేదా భక్తుల సంచారం ఉన్న ప్రాంతాల్లోకి పాములు వచ్చినప్పుడు వాటిని చంపకుండా, శిక్షణ పొందిన సిబ్బందితో రెస్క్యూ చేయించాలని సూచించారు.
విషపూరిత పాములను ఎలా గుర్తించాలి?
సర్పాల రెస్క్యూ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విషపూరిత పాముల గుర్తింపు, వాటి ప్రవర్తన, సురక్షితంగా పట్టుకోవడం, అనంతరం సహజ ఆవాసాల్లోకి తరలించడం వంటి అంశాలపై టిటిడి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. సర్పాల సంరక్షణలో భాగంగా మానవ భద్రతను ఏమాత్రం విస్మరించకూడదని నిపుణులు సూచించారు.
తిరుమల జీవవైవిధ్యాన్ని కాపాడాలి
టీటీడీ అటవీ శాఖ అధికారి జి. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. కాలుష్యం ప్రభావం, అటవీ–వన్యప్రాణి సంరక్షణ చట్టాలు, నిబంధనలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఒంటిమిట్ట బంజరు కొండల్లో విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించినట్లు తెలిపారు. వృక్ష, వన్యప్రాణి సంపదను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
భక్తుల భద్రత.. సర్పాల సంరక్షణ.. రెండూ కీలకమే
శ్వేత డైరెక్టర్ డా. వేమా వేంకట రత్నం మాట్లాడుతూ.. తిరుమల గిరుల్లోని జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ శిక్షణతో సిబ్బందిలో సర్పాల రెస్క్యూకు సంబంధించిన నైపుణ్యం, అప్రమత్తత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. ప్రకృతి పరిరక్షణ, భక్తుల భద్రత, సర్పాల సంరక్షణ అనే మూడు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు.

