AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే బస్సు.. రెండు బాధ్యతలు.. బంధం మాత్రం తండ్రీకొడుకులది

కామారెడ్డి జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సులో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. బోర్లం గ్రామానికి చెందిన గుజ్జరి గంగారం డ్రైవర్‌గా, ఆయన కుమారుడు రంజిత్‌కుమార్‌ కండక్టర్‌గా ఒకే బస్సులో విధులు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్–బాన్సువాడ రూట్‌లో తండ్రి స్టీరింగ్‌ పట్టుకుని బస్సు నడుపుతుంటే.. కొడుకు ప్రయాణికులకు టికెట్లు ఇస్తున్నాడు.

ఒకే బస్సు.. రెండు బాధ్యతలు.. బంధం మాత్రం తండ్రీకొడుకులది
Father Son
Diwakar P
| Edited By: |

Updated on: Sep 22, 2026 | 5:28 PM

Share

“నాన్నా.. బస్సు ఆపు!” ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా వినిపించిన ఈ మాటతో ప్రయాణికులు కాస్త ఆశ్చర్యపోయారు. సాధారణంగా బస్సులో డ్రైవర్‌ను ‘అన్నా’ అని, ‘అంకుల్‌’ అని పిలుస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి డ్రైవర్‌ను ఏకంగా ‘నాన్న’ అని పిలవడంతో ప్రయాణికుల్లో ఆసక్తి మొదలైంది. అసలు ఆ డ్రైవర్ ఎవరు? ‘నాన్న’ అని పిలిచింది ఎవరు? అనే సందేహంతో ఆరా తీయగా.. ఆసక్తికరమైన విషయం బయటపడింది.

కామారెడ్డి జిల్లాకు చెందిన ఈ ఆర్టీసీ బస్సులో డ్రైవర్, కండక్టర్‌గా పనిచేస్తున్న ఇద్దరూ నిజంగానే తండ్రీకొడుకులు. బోర్లం గ్రామానికి చెందిన గుజ్జరి గంగారం దశాబ్దాలుగా ఆర్టీసీలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా స్టీరింగ్‌ పట్టుకుని ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడమే తన బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇక గంగారం కుమారుడు రంజిత్‌కుమార్ ఇటీవలే ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగంలో చేరాడు. తండ్రి ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీలో పనిచేస్తుండగా.. ఇప్పుడు కొడుకు కూడా అదే సంస్థలో అడుగుపెట్టడం కుటుంబానికి సంతోషాన్ని కలిగించింది. అయితే అసలు ఆసక్తికరమైన విషయం ఇక్కడే జరిగింది. బాన్సువాడ డిపో అధికారులు తండ్రీకొడుకులకు ఒకే బస్సులో డ్యూటీ వేశారు. దీంతో నిజామాబాద్–బాన్సువాడ రూట్‌లో నడిచే బస్సులో తండ్రి డ్రైవర్‌గా స్టీరింగ్‌ పట్టుకుంటే.. కొడుకు కండక్టర్‌గా ప్రయాణికులకు టికెట్లు ఇస్తూ కనిపించాడు.

ఇంట్లో తండ్రి–కొడుకులుగా ఉండే గంగారం, రంజిత్‌కుమార్‌.. డ్యూటీలో మాత్రం డ్రైవర్‌–కండక్టర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తండ్రి బస్సును నడుపుతుంటే.. కొడుకు ప్రయాణికుల వద్దకు వెళ్లి టికెట్లు ఇస్తూ, బస్సులో ప్రయాణికుల సౌకర్యాలను చూసుకుంటున్నాడు. ఒకే బస్సులో ఇద్దరూ కలిసి విధులు నిర్వహించడంతో ప్రయాణికులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పటివరకు తండ్రి ఆర్టీసీలో తన బాధ్యతను నిర్వర్తిస్తూ కుటుంబాన్ని చూసుకోగా.. ఇప్పుడు అదే సంస్థలో కొడుకు కూడా ఉద్యోగిగా చేరడం మరో ప్రత్యేకత. అంతేకాదు.. తండ్రి డ్రైవర్‌గా, కొడుకు కండక్టర్‌గా ఒకే బస్సులో కలిసి పనిచేసే అవకాశం రావడంతో వారి ప్రయాణం మరింత ప్రత్యేకంగా మారింది.

రోజూ బస్సులో ప్రయాణించే వారికి ఇది ఓ సాధారణ ఆర్టీసీ సర్వీసే కావొచ్చు. కానీ గంగారం, రంజిత్‌కుమార్‌కు మాత్రం ఇది తండ్రి–కొడుకుల అనుబంధాన్ని ఉద్యోగ బాధ్యతలతో కలిపిన ఓ మధురమైన ప్రయాణం. స్టీరింగ్‌పై తండ్రి.. ప్రయాణికుల మధ్య కొడుకు.. ఒకే బస్సులో సాగుతున్న ఈ అరుదైన ప్రయాణం ఇప్పుడు పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంట్లో తండ్రీకొడుకులు.. డ్యూటీలో డ్రైవర్‌–కండక్టర్లు.. ఇలా కుటుంబ బంధానికి ఉద్యోగ బాధ్యతలు తోడైన ఈ ప్రయాణం ఆర్టీసీ బస్సులో ఓ మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది.

Follow Us