తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. లక్షల విలువైన బంగారు లాకెట్, ముత్యాల హారం సమర్పించిన జైపూర్ భక్తుడు
Tirumala Donation: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి జైపూర్‌కు చెందిన ఆర్తి బిందాల్ దంపతులు రూ.51.55 లక్షల విలువైన బంగారు లాకెట్, ముత్యాల హారాన్ని విరాళంగా అందించారు. టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆభరణాలను సమర్పించారు. విరాళాల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు అపరకుభేరుడు. ఎంతో మంది చక్రవర్తులు రాజులే కాదు.. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులు కూడా వెలకట్టలేని ఆభరణాలు శ్రీవారికి కానుకగా సమర్పించారు. ఇలా వజ్ర వైడూర్యాలు, రూ. వేల కోట్ల స్థిరాస్తులు ఉన్న శ్రీ వేంకటేశ్వరుడికి భక్తులు సమర్పించే కానుకలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇందులో భాగం గానే శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళంగా ఇచ్చారు జైపూర్‌కు చెందిన ఆర్తి బిందాల్ దంపతులు.
తిరుమల శ్రీవారికి శనివారం రూ.51.55 లక్షలు విలువైన 174 గ్రాముల బంగారు లాకెట్, ముత్యాల హారాన్ని విరాళంగా అందించారు. వీటిలో రూ.44.35 లక్షలు విలువైన వజ్రాలు, రత్నాలు పొదిగిన 147 గ్రాముల బంగారు లాకెట్, రూ.7.20 లక్షలు విలువైన వజ్రాలు, కెంపులు పొదిగిన 27 గ్రాముల మూడు వరుసల ముత్యాల హారాలు ఉన్నాయి. ఈ మేరకు దాత తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు ఆభరణాలను అందజేశారు. ఈ సందర్భంగా దాతలను అభినందించారు టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడు.
శ్రీవారికి అందిన మరిన్ని విరాళాల వివరాలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్ కు చెందిన ఎస్ఎస్కే ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ ప్రొప్రైటర్ జి. శ్రవణ్ కుమార్ రూ.15 లక్షల విలువైన ఔషధాలను, ఇందు డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత తలశిల వెంకటేశ్వరరావు రూ.3 లక్షల విలువైన ఔషధాలను శనివారం విరాళంగా అందించారు. ఈ మేరకు టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు శనివారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బి.ఆర్. నాయుడును కలిసి దాతల తరఫున ఔషధాలను అందజేశారు.
తాడిపత్రికి చెందిన హర్షవర్ధన్ రెడ్డి అనే భక్తుడు శనివారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
తిరుపతికి చెందిన విష్ణు ప్రసాద్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.




