Palnadu: అమ్మో పులి.. పల్నాడులో కలకలం.. రెండు గేదెలపై దాడి..

పల్నాడులో మళ్లీ పులి కదలికలు కలకలం రేపుతున్నాయి. వెల్ధుర్తి మండలం వజ్రాల తండా వద్ద రెండు గేదెలపై పులి దాడి చేసినట్లు అటవీ అధికారులు నిర్ధారించారు. ఇది శ్రీశైలం సాగర్‌ పులుల అభయారణ్యం పరిధిలోకే వస్తుందని, పులి తిరిగి అడవిలోకి వెళ్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Palnadu: అమ్మో పులి..  పల్నాడులో కలకలం.. రెండు గేదెలపై దాడి..
Tiger

Edited By: Ram Naramaneni

Updated on: Nov 11, 2025 | 8:40 PM

నల్లమల ఫారెస్ట్ పల్నాడులో విస్తరించి ఉంది. మాచర్ల నియోజకర్గంలోని వెల్ధుర్తి మండలంలోని అనేక గ్రామాల పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో వన్య ప్రాణ సంరక్షణ కేంద్ర ఉంది. శ్రీశైలం సాగర్ పులల అభయారణ్యం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడూ కూడా పులులు సమీప గ్రామాలకు వచ్చిన దాఖలాలు కూడా లేవు. అయితే 2023లో మొదటి సారి దుర్గి మండలంలోని గజాపురంలో ఆవు మీద పులి దాడి చేసింది. అడవి నుంచి బయటకు వచ్చిన పులి సమీప పొలాల్లోని ఆవుపై అటాక్ చేసింది. దీంతో అటవీ శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి కదలికలను గుర్తించే ప్రయత్నం చేశారు. అయితే ఆవుపై దాడి చేసిన తర్వాత పులి తిరిగి ఆ ప్రాంతంలో కనిపించలేదు.

ఆ తర్వాత వెల్దుర్థి మండలంలోని అభయారణ్యం పరిధిలోకి వచ్చే గంగలకుంట సమీప అటవీ ప్రాంతంలో మూడు పులులు సంచరిస్తున్నట్లు గుర్తించారు. అయితే అ ప్రాంతం అభయారణ్యం పరిధిలోకి వస్తుంది కాబట్టి తిరిగి పులులు దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతాయని అటవీ అధికారులు చెప్పారు. కొద్దికాలం తర్వాత మిట్టమీదపల్లె వద్ద కొన్ని జంతువుల ఎముకల ఆనవాళ్లు బయట పడటం కలకలం రేపింది. రైతులు పన్నిన ఉచ్చులో చిక్కుకొని పులులు చనిపోతే వాటిని కాల్చి వేశారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే అధికారులు దర్యాప్తు చేసి తప్పుడు ప్రచారంగా తేల్చారు. ఇక అప్పటి నుండి పల్నాడు జిల్లాలో పులి కదలికలు లేవు. ఇటీవల రెంటచింతల మండలం తుమ్రుకోట సమీప అటవీ ప్రాంతంలో ఆవులపై పులి దాడి చేసిందన్న ప్రచారం జరిగింది. అయితే పశువుల కాపర్ల తప్పుగా భావించి పులి అనుకొని ప్రచారం చేసినట్లుగా అటవీ శాఖాధికారులు తేల్చారు.

ఇవన్నీ గతంలో జరిగిన ఘటనలు కాగా మరోసారి రెండు రోజుల క్రితం వెల్ధుర్తి మండలం వజ్రాల తండా వద్ద పుల్లి రెండు గెదేలపై దాడి చేసి చంపినట్లు అటవీ శాఖాధికారులు తేల్చారు. అది అభయారణ్యం పరిధిలోకే వస్తుంది. అయితే మొదటి సారి ఇక్కడ పులి గేదెలపై దాడి చేయడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. పగ్ మార్క్స్ సేకరించిన ఫారెస్ట్ అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు. రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాలకు వెళ్ళవద్దని హెచ్చరించారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి కదలికలను గుర్తిస్తున్నట్లు చెప్పారు.

సాధారణంగా అభయారణ్యం నుంచి వచ్చిన పులి తిరిగి దట్టమైన అడవిలోకే వెళ్తుందని అయితే కొన్ని కొన్నిసార్లు తన అవాసాన్ని మార్చుకునే క్రమంలో అక్కడ సమీపంలోనే ఉండిపోవచ్చని అధికారులు అంటున్నారు. అయితే దాని అవాస పరిధిలోకి వెళ్లకుండా పశువుల కాపర్లు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మార్కాపురం అభయారణ్యం పరిధిలోకి వస్తుండటంతో అక్కడి అధికారులు స్థానికులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు.

అటవీ ప్రాంతంలో నీరు సమృద్దిగా ఉండే సమయంలో గేదెలపై పులి దాడి చేయడంపై అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు పులి కదలికలను ప్రత్యేక కెమెరాల ద్వారా గుర్తించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరి కొంత కాలం పాటు అభయారణ్యం పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అంటున్నారు. స్థానికులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.