
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఉడినట్లైయింది. నాటువైద్యం వికటించి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పూలకుంట్లపల్లిలో నాటు వైద్యుడు మోకాళ్ల నొప్పులకు ఇంజక్షన్ ఇచ్చాడు. ఈ ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృతి చెందారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఓబులదేవరచెరువు మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పూలకుంట్లపల్లి గ్రామంలో నాటు వైద్యుడిని ఆశ్రయించారు. మోకాళ్ల నొప్పుల విషయంలో బాధితులు ఇద్దరు వ్యక్తులు నాటు వైద్యులు నబీ రసూల్, రామ్‌నాథ్ వద్ద చికిత్స తీసుకున్నారు.
నాటు వైద్యుడు అందించిన చికిత్స తర్వాత ఇద్దరు బాధితుల కాళ్లు వాపు వచ్చాయి. అంతేకాదు బాధితుల అంతర్గత అవయవాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో తుమ్మలకుంటపల్లికి చెందిన పొప్పురమ్మ, బసప్పగారిపల్లికి చెందిన రామప్పలు మరణించారు. తాజా మరొకరు ప్రాణాలు కోల్పోయినట్టుగా స్థానికులు చెప్పారు. ఈ విషయమై జిల్లా వైద్యశాఖాధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు.
ఈ నాటు వైద్యుడి వద్ద సుమారు 40 మంది వరకు మోకాళ్ల నొప్పులకు చికిత్స తీసుకున్నారని సమాచారం. ఈ ఇంజక్షన్ తీసుకున్నవారిలో అస్వస్థతకు గురైన వారిలో కొందరు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బత్తలపల్లిలోని ఆర్డీటీ, పులివెందులలోని ఆసుపత్రుల్లో 20 మంది వరకు బాధితులు చికిత్స పొందుతున్నారు.
కాగా.. ఈ సంఘటన శ్రీసత్యసాయి జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..