Two Times Sankranti Festival: ఈ గ్రామానికి ఏడాదిలో రెండుసార్లు సంక్రాంతి పండ‌గ‌.. కారణం ఏంటో తెలుసా..?

|

Jan 14, 2021 | 2:33 PM

Two Times Sankranti Festival: ఆ ఊరికి సంక్రాంతి సంబురాలు ముందే వచ్చేశాయి. చిన్నారుల ఆట పాటలు, పెద్దల సంప్రదాయ పూజలు, మహిళల ప్రత్యేక పిండి వంటలతో ఆ గ్రామంలో ...

Two Times Sankranti Festival: ఈ గ్రామానికి ఏడాదిలో రెండుసార్లు సంక్రాంతి పండ‌గ‌.. కారణం ఏంటో తెలుసా..?
Follow us on

Two Times Sankranti Festival: ఆ ఊరికి సంక్రాంతి సంబురాలు ముందే వచ్చేశాయి. చిన్నారుల ఆట పాటలు, పెద్దల సంప్రదాయ పూజలు, మహిళల ప్రత్యేక పిండి వంటలతో ఆ గ్రామంలో పెద్ద పండగ సందడి కనిపిస్తుంది. వారం రోజుల ముందుగానే సంక్రాంతి పండగను జ‌రుపుకునే ఆచారమున్న ఆ గ్రామ విశేషాలను ఓ సారి చూసేద్దాం.

అది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని ఇటకర్ల పల్లి గ్రామం. ఆ గ్రామానికో ప్రత్యేకత ఉంది. అందరికీ ఏడాదికి ఒక్కసారే సంక్రాంతి పండుగ వస్తుంది. కానీ ఇటకర్లపల్లి గ్రామ వాసులు మాత్రం ఏడాదిలో రెండు సార్లు సంక్రాంతి పండుగ చేసుకుంటారు. గ్రామంలో సంక్రాంతి పండగను మిగిలిన వారి కంటే ఓ వారం రోజుల ముందుగా గ్రామస్తులు జరుపుకొంటారు. సంక్రాంతి పండగకు వారం రోజుల ముందు భోగి, సంక్రాంతి, కనుమలను చేసుకుంటారు. భోగి పండగ విషయంలోనూ ఇటకర్ల పల్లి ప్రత్యేకమే.

గ్రామంలో భోగి మంటలను వేయకుండా సాదాసీదాగా జరుపుతారు. పూర్వీకుల కాలంలో భోగి మంటల్లో పిల్లి పడి మరణించడంతో ఆ తరువాత నుంచి భోగి ని వేడుకగా నిర్వహించకూడదని నిర్ణయించుకున్నారు గ్రామవాసులు. అప్పటి నుంచి తర తరాలుగా గ్రామవాసులు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆ గ్రామంలో మీసాల ఇంటి పేరున్న పెద్ద కుటుంబీకులే ప్రతియేటా సంక్రాంతి వేడుకలను నిర్వహిస్తూ వస్తుండటం ఆ గ్రామ సంప్రదాయం. ఇటకర్లపల్లి గ్రామంతో పాటు చుట్టుప్రక్కల గ్రామస్తులు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటూ తామంతా ఒకే కుటుంబమని చెప్పుకోవడం విశేషం.

విద్య, ఉద్యోగాల నిమిత్తం వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న వారంతా జనవరి మొదటి వారంలోనే గ్రామానికి చేరుకుంటారు. ముందుగా గ్రామ సంప్రదాయం ప్రకారం సంక్రాంతిని జరుపుకొని ఆ తరువాత బంధుమిత్రులతో కలిసి మకర సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ విధంగా రెండు సార్లు సంక్రాంతి వేడుకలను జరుపుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది ఇటకర్లపల్లి గ్రామం.

Sankranti celebrations : తెలుగు లోగిళ్ల వెలుగులు, భక్తిప్రపత్తులతో.. ఆనందోత్సాహాల మధ్య సాంప్రదాయాలు ఒట్టిపడేలా మకర సంక్రాంతి పర్వదినం