వేసవికాలం వచ్చిందంటే చాలు దొంగలు రెచ్చిపోతుంటారు. తాళాలు వేసిన ఇళ్ళను ఎంచుకుని అర్దరాత్రి ఇంట్లోకి చొరబడి దొరికినదంతా దోచుకెళుతుంటారు. ఊళ్ళకు వెళితే, పట్టపగలే ఇళ్ళల్లోకి దూరిన సందర్భాలు అనేకం చూశాం. కానీ ఈ దొంగతనం మాత్రం విచిత్రమైంది. ఇళ్ళల్లో ముద్దుగా పెంచుకునే పెట్స్ ని ఎత్తుకెళ్ళడం సంచలనంగా మారింది. అది కూడా బ్యాంకు దొంగతనం చేయడానికో, లేదా ఏటీఎం కొల్లగొట్టడానికో వచ్చినట్లు మాస్కులు వేసుకుని మరీ వచ్చి దొంగతనం చేశారు. ఇలాంటి చిత్రమైన ఘటన రాష్ట్రంలో ఇదే తొలిసారి అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నెల్లూరు నగరంలో ఈ దొంగతనం జరిగింది.
ఇక వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నగరంలో వీఆర్సీ సెంటర్ వద్ద ఓ పెట్స్ షాప్ ఉంది. దేశవిదేశాల నుంచి ఎన్నో రకాల పక్షులు, పెంపుడు కుక్కలు, పిల్లులు తెచ్చి ఈ షాప్ లో విక్రయిస్తుంటారు. ఎన్నో రకాల బ్రీడ్ పెట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇటీవలికాలంలో ఈ పెట్స్ కి విపరీతమైన డిమాండ్ పెరిగింది. భారీ రేటు పెట్టి నెల్లూరు వాసులు కొనుగోలు చేస్తున్నారు. వీటి మీద కన్ను పడిందో ఏమో, కొంతమంది అర్ధరాత్రి షాపులో దూరి పెంపుడు జంతువులను ఎత్తుకెళ్ళారు. ముఖానికి మాస్కులు వేసుకుని చడీచప్పుడూ లేకుండా కుక్కలు, పిల్లులను తీసుకుపోయారు.
ఎంత సైలెంట్‌గా వచ్చారో, అంతే సైలెంట్‌గా పని కానిచ్చేసి పరారయ్యారు. తెల్లవారిన తర్వాత షాపు తెరిచేందుకు వచ్చిన యజమానులు దొంగతనం జరిగిందని, పెట్స్ ని ఎత్తుకుపోయారని తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు షాపు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో దొంగతనం జరిగిన దృశ్యాలు రికార్డయ్యాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం