Raghu rama Krishna raju Case : పశ్చిమగోదావరిజిల్లా నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్ట్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇవాళ కీలక విచారణ జరుగుతోంది. ఇప్పటికే రఘురామరాజు మెడికల్ రిపోర్టులు సుప్రీం కోర్టుకు చేరాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు.. ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసు విషయంలో ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుందన్న దానిపై రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇలాఉంటే, సుప్రీం కోర్టు ఈ కేసు విచారణను మధ్యాహ్నం 2.30కి వాయిదా వేసింది. మరోవైపు, రఘురామరాజు తనయుడు భరత్ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీలో తన తండ్రి మీద దాడిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. సీబీఐ లేదా ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపించాలన్న భరత్.. ప్రతివాదులుగా సీఎం జగన్, సీబీసీఈఐడీ అధికారులను చేర్చారు. దర్యాప్తులో దోషులుగా తేలిన వారిపై కేసులు నమోదు చేసేలా ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా, రఘురామ రాజు కేసుకు సంబంధించి సుప్రీం న్యాయమూర్తులు వినీత్‌శరణ్, బీఆర్ గగాయ్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది.