Andhra News: అయ్యో పాపం దొంగన్నా.. కొట్టేసిన కారులోనే కునుకేశాడు.. కట్ చేస్తే.. సీన్ రివర్స్

దొంగలు పలు రకాలు.. ఒక్కొక్కడు కొట్టేసిన పదేళ్ల కానీ దొరకడు.. కానీ ఇంకొక్కడు కొట్టేసిన 10 నిమిషాలకే దొరికిపోతాడు... ఓ దొంగ కార్లు కొట్టేసి అందులోనే పడుకొని కొట్టేసిన గంటకే దొరికేశాడు. తీరా ఇది ఏంటి అని అడిగితే నాకేం తెలియదంటూ మాట్లాడడంతో చుట్టుపక్కన ఉన్నవాళ్లు అతనిని కొట్టాలో.. నవ్వాలో తెలియక పోలీసులకు అప్పచెప్పారు.

 Andhra News: అయ్యో పాపం దొంగన్నా.. కొట్టేసిన కారులోనే కునుకేశాడు.. కట్ చేస్తే.. సీన్ రివర్స్
The Thief Who Slept In The Theft Car Was Arrested In Vempalli
Follow us
Sudhir Chappidi

| Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 15, 2024 | 7:33 AM

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి నగరంలో ఒక దొంగ వింత పని చేసి దొరికిపోయాడు. పులివెందుల – రాయచోటి బైపాస్ రోడ్డులో బొలెరో వాహనాన్ని కొట్టేశాడు. కొద్ది దూరం వెళ్ళాడు నెంబర్ ప్లేట్లు మార్చాడు. అయితే అక్కడ నుంచి వెళ్ళకుండా హాయిగా కారు రోడ్డు పక్కన పార్కు చేసి అద్దాలన్ని పైకెత్తి చల్లగా ఏసీ వేసుకొని హాయిగా నిద్రపోయాడు. అంతే చక్కగా పట్టుబడ్డాడు. తీరా ఎందుకు ఇక్కడ ఆగావు ఎవరిది వాహనం అంటే నాకేం తెలీదు అని సమాధానం చెప్పడంతో అక్కడున్న వారు అతనిని కొట్టాలో లేక నవ్వాలో తెలియక పోలీసులకు అప్పచెప్పారు. వేంపల్లి‌కు చెందిన శివారెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన బొలెరో వాహనం అది.. శివారెడ్డి ఇటీవల వరి పంట కోసి వడ్లను రోడ్డుపై ఆరబోశాడు.

అయితే ఆ వడ్ల దగ్గర అతని తండ్రిని కాపలాగా పెట్టాడు. అసలే చలికాలం కావడం మంచు కూడా ఎక్కువగా కురుస్తూ ఉండడంతో తండ్రికి ఇబ్బంది లేకుండా బొలెరో వాహనాన్ని వడ్లు ఆరబోసిన దగ్గర రోడ్డు పక్కనే తన తండ్రి నిద్రపోవడం కోసం పెట్టాడు. అయితే ఇది రోజు గమనిస్తూ ఉన్న ఆ దొంగ నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో శివారెడ్డి తండ్రి వాహనంలో లేకపోవడం చూసి చక్కగా ఆ వాహనాన్ని వేసుకొని మూడు కిలోమీటర్లు వెళ్లిపోయాడు. అక్కడ బండి పక్కన ఆపి బండి నెంబర్ ప్లేట్లు మార్చి, అద్దాలు పైకెత్తి ఏసి వేసుకొని హాయిగా నిద్రపోయాడు. అయితే బండి లేదు అనే విషయాన్ని గమనించిన శివారెడ్డి తండ్రి అతనికి చెప్పడంతో చుట్టుపక్కల ప్రజలు, బండి యజమాని వేంపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చి వారు కూడా వెతకడం మొదలుపెట్టారు. అయితే వెతకడం మొదలుపెట్టిన కొద్దిసేపటికి కొంచెం దూరంలోనే వాహనం ఆగి ఉండడం గమనించి దగ్గరకు వెళ్ళి చూడగా నెంబర్ ప్లేట్ అయితే వేరే కానీ వాహనం అయితే తమదిగా శివారెడ్డి గుర్తించాడు. దీంతో బండిలో ఉన్న దొంగను లేపి ఈ వాహనం ఎక్కడిది, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడిగితే ఏమో నాకు తెలియదు అని సమాధానం చెప్పడంతో అక్కడున్న వారికి ఏం చేయాలో తెలియక అతనిని పోలీసులకు అప్పచెప్పారు. అయితే చోరీ చేసిన వాహనంలో హాయిగా పారిపోకుండా ఏసీ వేసుకొని నిద్రపోయి పట్టు పడటం అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేయడంతో పాటు అతన్ని ఏమనాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి