ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఇష్యూ.. రోజుకో మలుపు తిరుగుతోంది. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామని అధికార పార్టీ చెబుతుంటే.. అమరావతిని రాజధానిగా ఒప్పుకుని ఇప్పుడు మాట మార్చడమేంటని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయం రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. చివరకు దేశ సర్వోన్నత న్యాయస్థానం వద్దకు చేరింది. ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్ల విచారణ అంశం సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. వీటిని త్వరగా విచారించాలని జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం వద్ద రాష్ట్ర ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు. వీటిపై అమరావతి ప్రాంత రైతులు, ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు స్పందించారు. ఈ కేసులో తమకు న్యాయస్థానం ఇచ్చిన నోటీసులు జనవరి 27న అందాయని తెలిపారు.
ఇరుపక్షాలు ప్రస్తావించిన అంశాలపై చర్చించిన అనంతరం.. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం స్పష్టం చేసింది.. నాడు కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేశారు. కానీ ఆరోజు విచారణకు రాలేదు. అప్పటివరకు ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం కూడా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. కాగా.. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి.
త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారబోతోంది. నేను కూడా అక్కడికే షిఫ్ట్ అవుతున్నాను. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వరసగా మూడు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ నంబర్ వన్‌గా నిలిచాం. ఇప్పటికే 6 పోర్టులు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. పరిశ్రమలకు అనుమతుల విషయంలో సింగిల్ డెస్క్ విధానం అమల్లో ఉందని, 21 రోజుల్లో అనుమతులు ఇస్తున్నాం. విశాఖపట్నం త్వరలో రాజధాని కాబోతుంది.
– వైఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..