Andhra Pradesh: ఆశ మనిషిని ఎంతటి పనినైనా చేసేందుకు ఉసిగొల్పుతుంది. ఆశ మనిషిలోని మానవత్వాన్ని చంపేసి.. క్రూరత్వాన్ని మేల్కొలుపుతుంది. తాజాగా దీనికి నిదర్శనమైన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. కొత్తగా ఉద్యోగం రావడంతో.. పదేళ్లుగా కాపురం చేసిన భార్యను వద్దంటూ ఇంటి నుంచి బయటకు గెంటేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా గుండావారి పల్లికి చెందిన రామాంజులు.. కురబలకోట మండలం అంగళ్లు కు చెందిన కళావతిని పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురుు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. తాజాగా అతనికి బీఎస్ఎఫ్‌లో ఉద్యోగం వచ్చింది.
అయితే, ఉద్యోగం వచ్చిన నేపథ్యంలో.. మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన అతని మనసులో పుట్టింది. ఈ నేపథ్యంలోనే.. తన భార్యకు చదువు లేదని, ఆమె వద్దంటూ భార్య, పిల్లలను ఇంటి నుంచి గెంటేశాడు రామాంజులు. అంతేకాదు.. ఇటీవలే బీఎస్ఎఫ్ ట్రైనింగ్ పూర్తి చేసిన రామాంజులు.. అధిక కట్నంతో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు.. దిక్కుతోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించింది. సబ్ కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కళావతి తన ముగ్గురు బిడ్డలతో కలిసి ఆందోళనకు దిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకోగా.. న్యాయం చేస్తామంటూ అధికారులు ఆమెకు భరోసా ఇచ్చారు. ఇక రెండో పెళ్లికి సిద్ధమైన రామాంజులుకు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
Also read:
International Drug Racket: ఉడ్తా విజయవాడ.. డ్రగ్స్ డొంక కదిలిందా..?? లైవ్ వీడియో