
Smart Kitchens: మహిళలకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. స్వయం సహాయక సంఘాలకు మరో కీలక బాధ్యతలను అప్పగించనుంది. మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. అలాగే పలు కోర్సుల్లో వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తోంది. ఈ క్రమంలో వారి కోసం మరో పథకం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లల్లో మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంది. ఈ పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా స్మార్ట్ కిచెన్ల బాధ్యతలను మహిళా సంఘాలకు అందించనుంది.
వంట వండటమే కాకుండా ప్యాకింగ్, సమయానికి భోజనం పంపించడం, వ్యర్థాల నిర్వహణ వంటి బాధ్యతలను మహిళలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలోని కడప, జమ్మలమడుగు వంటి ప్రాంతాల్లో స్మార్ కిచెన్లను మహిళా సంఘాలకు అప్పగించడంతో సక్సెస్ అయింది. దీంతో త్వరలో మరో 33 స్మార్ట్ కిచెన్ల బాధ్యతలను కూడా వారిని ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఇక మహిళా సంఘాల ఆధ్వర్యంలో నేచురల్ ఫార్మింగ్ కూరగాయలు పండిస్తున్నారు. వీటిని మధ్యాహ్న భోజనం పథకానికి ఉపయోగించనున్నారు.
మహిళా సంఘాలు పండించిన కూరగాయలు మధ్యాహ్న భోజన పథకంకు సరఫరా చేయడం వల్ల వారికి ఆదాయం లభిస్తుంది. అలాగే సేంద్రీయ వ్యవసాయంపై మహిళా సంఘాలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇందుకు మండల సమాఖ్యలు సహాయం చేయనున్నాయి. ఆర్గానిక్ కూరగాయలు మధ్యాహ్న భోజన పథకంలో ఉపయోగించడం వల్ల పిల్లలకు పోషక విలువలు కూడా పెరగనున్నాయి. అంతేకాకుండా మహిళలకు ఉపాధి కూడా లభించనుంది.