Andhra Pradesh: చంద్రబాబు రోడ్ షోలో ఉద్రిక్తత.. రాళ్ల దాడిలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కు గాయాలు..

|

Nov 04, 2022 | 7:07 PM

ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. నందిగాంలో రోడ్ షో లో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడిలో..

Andhra Pradesh: చంద్రబాబు రోడ్ షోలో ఉద్రిక్తత.. రాళ్ల దాడిలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కు గాయాలు..
Chandra Babu Road Show
Follow us on

ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. నందిగాంలో రోడ్ షో లో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడిలో చంద్రబాబు నాయుడు చీఫ్ సెక్యూరిటీ అధికారికి గాయాలైనట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాదుడే, బాదుడు కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పన్నుల పేరుతో ప్రజలపై భారం మోపుతుందని ఆరోపిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బాదుడే బాదుడు పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ తలపెట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ముందుగా చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించారు. నందిగామ రోడ్ షోలో మాట్లాడుతుంగా గుర్తు తెలియని వ్యక్తి వాహనంపై రాయి విసిరినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరయ్యారు. నందిగామ రోడ్డు భారీ జనంతో నిండిపోయింది. రోడ్ షోకు వచ్చిన ప్రజలనుద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉంది. దీంతో ఆయనకు ఎన్ ఎస్ జీ కమాండోలు భద్రతగా ఉంటారు. అదే సమయంలో రాష్ట్రంలో ఎక్కడికి పర్యటనకు వెళ్లినా, అక్కడి స్థానిక పోలీసులు చంద్రబాబు భద్రతను చూసుకోవల్సి ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు రోడ్ షో నేపథ్యంలో స్థానిక పోలీసులతో కూడా భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులు ఉన్న సమయంలోనే దాడి జరిగిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడుతోందని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.

ఈ ఘటనపై చంద్రబాబు నాయుడు స్పందించారు. పోలీసుల భద్రతా వైఫల్యమే దీనికి కారణమన్నారు. పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపేరోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. వైసీపీ రౌడీలకు భయపడే ప్రస్తక్తే లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇక నీ ఆటలు సాగవంటూ హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేసేవి నవరత్రాలు కాదని, నవ ద్రోహలని ఇమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేది గోరంతని, దోచుకునేది కొండంత అని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు టీడీపీ థ్యేయమన్నారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరపడ్డాయన్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనలో రాయి విసిరిన సమయంలో కరెంట్ కూడా తీసేశారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడ్డారంటోంది. ఈ ఘటన వెనుక వాస్తవాలను పోలీసులు తమ విచారణలో నిగ్గు తేల్చాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..