ఏరువాక పౌర్ణమి.. వ్యవసాయ సీజన్ ప్రారంభానికి సూచికగా పల్లెల్లో రైతులు సంబరంగా నిర్వహించుకునే సంప్రదాయ పండుగ. మొత్తంగా ఏడాదికోసారి వచ్చే ఏరువాక పౌర్ణమి వేడుకలు పల్లెల్లో అంబరాన్నంటాయి. రైతుల పండుగ ఏరువాక పౌర్ణమిని ఏపీ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తమకు చేదోడువాదోడుగా ఉంటున్న ఎద్దులకు రంగులద్ది, అలంకరణలతో సింగారించి వాటికి పూజలు చేశారు. తొలకరి చినుకులతో మొదలయ్యే ఖరీఫ్ సాగు పనులు నిర్విఘ్నంగా సాగాలని కోరుతూ పూజలు చేశారు.
సాధారణంగా ఏరువాక పౌర్ణమి రోజున అన్నదాతలు తమ కాడెద్దులకు స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూసి..మెడలో గజ్జెలు, గంటలతో అలంకరిస్తారు. ఆ తర్వాత ఎడ్ల పందేలు నిర్వహిస్తారు. అయితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్‌లో కాస్త వెరైటీగా నిర్వహించారు. రైతులు వృషభాలకు స్నానం చేయించి.. రంగులతో ముస్తాబు చేశారు. సాయంత్రం ఎద్దులతో పార్వేట ఉత్సవం నిర్వహించారు. అయితే పార్వేట సందర్భంగా యువకులు సినీ హీరోల వేషధారణలో ఆకట్టుకున్నారు. గేమ్ చేంజర్ చిత్రంలోని రామ్ చరణ్ తెల్లభట్టలతో సైకిల్ తొక్కుతూ, ఖైదీల డ్రస్‌లలో, అల్లు అర్జున్ నటించిన పుష్ప గెటప్, మిలిటరీ బేటాలియన్, వేశాధారణలు ఇలా తమతమ హీరోల వేశాధారణలు వేసి విధుల్లో తిరుగుతూ సందడి చేశారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం సామర్లకోటలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప దుక్కి దున్నే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పంటలు సమవుద్దిగా పండాలని అధిక దిగుబడులతో రైతులకు లాభాలు రావాలని గోమాత, భూమాత, ప్రకృతి మాతలకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో ఏరువాకలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. దుక్కి దున్నే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పెదమక్కెనలో టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో కన్నా లక్ష్మీనారాయణ పొలం దున్నారు. డప్పుల వాయిద్యాలు, రైతుల కేరింతలు, నృత్యాలతో ఆయా గ్రామాల్లో ఊరేగింపులు ఉత్సాహంగా సాగాయి. బండెనక బండి వస్తూ ఏరువాక సంబరాలు ముందస్తుగా అగుపించాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఊత్సాహన్ని నింపారు.
ఏరు అంటే నాగలి. వాక అంటే దున్నుట . రైతులు పంటలు పుష్కలంగా పండాలని చేలో నాగలితో దిగే ఈ పవిత్రమైన రోజు రైతన్నలకు నిజమైన పండుగ రోజు. అందరికీ అన్నం పెట్టే రైతన్నలు చల్లగా ఉండాలని కోరుకుందాం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..