ఆంధ్రప్రధేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. అనంతరం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం హెలికాప్టర్‌లో అధికారులు సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో వెంటనే హెలికార్టర్ ప్రయాణాన్ని రద్దు చేశారు. నార్పల నుంచి పుట్టపర్తికి ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉంది. అయితే సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో వెంటనే షెడ్యూల్‌లో మార్పులు చేశారు. దీంతో రోడ్డు మార్గాన సీఎం పుట్టపర్తికి బయలు దేరారు. హెలికాప్టర్ టేకాఫ్ అవ్వకముందే సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి ప్రయాణించాల్సి విమానంలో సాంకేతిక లోపం గుర్తించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఢిల్లీ బయలుదేరే సమయంలో ముఖ్యమంత్రి ప్రయణించాల్సిన ప్రత్యేక విమానంలో అధికారులు సాంకేతిక లోపాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. అప్పుడు మరో విమానంలో సీఎం ఢిల్లీకి వెళ్లారు. ఆ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి సాంకేతిక లోపం తలెత్తడం వివాదాస్పదంగా మారింది.
ఇదిలా ఉంటే అనంతపురం పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న ముఖ్యమంత్రి అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నార్పల మండలానికి వెళ్లారు. అక్కడ కార్యకర్తలతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం తిరిగి పుట్టపర్తి వెళ్లాల్సి ఉంది. అయితే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం గుర్తించడంతో రోడ్డు మార్గాన ముఖ్యమంత్రి పుట్టపర్తి చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి గన్నవరం వెళ్లనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..