రాజ్యసభ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేత వంగవీటి రాధా, ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాధా రాజకీయ భవిష్యత్తు, టీడీపీ వ్యూహాలపై ఈ భేటీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది.
2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వంగవీటి రాధాకు టికెట్ సర్దుబాటు చేయలేని పరిస్థితుల్లో ఆయనకు భవిష్యత్తులో రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ వంటి హామీని టీడీపీ నాయకత్వం ఇచ్చినట్టు ప్రచారం ఉంది. ప్రస్తుత రాజ్యసభ ఉప ఎన్నికల సమయంలో రాధాకు రాజ్యసభ ఛాన్స్ అవకాశం లభించకపోవడంతో సీఎం పిలిచి మాట్లాడినట్టు సమాచారం.
త్వరలో రాధకు ఎమ్మెల్సీ
2025 మార్చిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో ఆయనకు అవకాశం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భేటీ రాధాకు కీలకమైన హామీ పొందే దిశగా జరగగా, టీడీపీ ఆయనను భవిష్యత్ రాజకీయాల్లో కీలకంగా నిలపాలన్న వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
అన్నీ బాగుంటే మంత్రి పదవి కూడా
వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి లభిస్తే, రాబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనకు మంత్రిత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయని తాజా సమాచారం. కాపు సామాజికవర్గంలో ప్రముఖంగా ఉన్న వంగవీటి రాధాను, టీడీపీ మరింత బలమైన నాయకుడిగా చేసుందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. వంగవీటి రంగా కుమారుడిగా రాధా, కాపు సామాజిక వర్గానికి ఐకాన్‌గా ఉండడమే కాకుండా, ఆ వర్గంలో టీడీపీ పట్టు బలపర్చడానికి టీడీపీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నట్టు మరో స్పెక్యులేషన్ కూడా ఉంది.
వంగవీటి బ్రాండ్‌ను ఉపయోగించుకుంటూ రాధాకు మంచి రాజకీయ భవిష్యత్తును సృష్టించాలన్న టీడీపీ ఆలోచన కొత్త మలుపు తిరిగేలా చేస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వంగవీటి రాధా భవిష్యత్‌ను ప్రాముఖ్యతతో చూసే టీడీపీ, ఆయనకు రాజకీయ పదవులు, అవకాశాలు కల్పించే దిశగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి