టీడీపీకి(TDP) వస్తున్న ప్రజాదరణ ను చూసి ఓర్వలేకనే ముఖ్యమంత్రి వైఎస్.జగన్(CM.Jaganmohan Reddy) మహానాడుకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు. మహానాడును అడ్డుకుంటే తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. టీడీపీ నేతలను తరలివచ్చేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని కోరితే ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఒంగోలు(Ongole) కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన పార్టీ తోరణాలను అన్యాయంగా తొలగించారని మండిపడ్డారు. కడపలో పసుపు సైన్యం సత్తా చూసిన తరువాత జగన్‌కు వణుకు పట్టిందని చెప్పారు. జగన్ చెప్పే అబద్దాలు, డ్రామాలు చూసి తట్టుకోలేక ఆయన సభలకు వెళుతున్న ప్రజలు సభ మధ్యలో నుంచే పారిపోతున్నారని ఎద్దేవా చేసారు. వచ్చేఎన్నికల్లో పరాభవం తప్పదనే భయంతో జగన్ మహానాడును అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పట్టాభి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మహానాడుకు వచ్చే బస్సు లను అడ్డుకున్న మాత్రాన మహానాడు సక్సెస్ కాకుండాపోదు. శ్రీలంకలో పాలకులకు వచ్చిన పరిస్థితే జగన్‌కూ వస్తుంది. జగన్ లాగే చంద్రబాబు వ్యవహరించి ఉంటే జగన్ ప్రజల్లో తిరిగేవారా..? ఎన్ని అడ్డంకులెదురైనా పెద్ద పండుగలా మహానాడును నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
– పట్టాభి, టీడీపీ అధికార ప్రతినిధి
ఒంగోలులో మహానాడు నిర్వహించాలని అనుకున్నప్పటి నుంచి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని టీడీపీ నేతలు మండిపడ్డారు. మొదట ఒంగోలులోని మీని స్టేడియం ఇవ్వడానికి నిరాకరించిన ప్రభుత్వం, తరువాత కూడా పలు అడ్డంకులు సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినంత మాత్రాన మహానాడు ఆగదని చంద్రబాబు అన్నారు. మహానాడు అనేది పార్టీ పండుగ అయినప్పటికీ.. ఈ సారి ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తుందని స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి