ఎవరికెన్ని సీట్లు.. ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారు.. అనే క్లారిటీ రాకముందే.. ముందస్తుగానే బలప్రదర్శనకు దిగుతున్నాయి టీడీపీ-జనసేన. ఈవిధంగా అధిష్టానాలకు సాలిడ్ సిగ్నల్స్ ఇస్తూ.. సీట్ల పంపకాల ప్రక్రియను మరింత క్లిష్టంగా మార్చేస్తున్నారు స్థానిక నేతలు. అటు.. అంతర్గతంగా కూడా సీట్ల లొల్లి ముదరడంతో.. టీడీపీ అధినేత తలకు బొప్పి కట్టేలా ఉంది. తొలి జాబితా బైటికి రాకముందే.. దాని తాలూకు తుపాను ఆ రేంజ్‌లో ఉంది మరి.
గుంటూరు జిల్లాలో పాదయాత్రల రాజకీయం! టీడీపీ బలంగా వున్న చోట జనసేన… జనసేన బలంగా వున్న చోట్ల టీడీపీ… పాదయాత్రలతో తమతమ సత్తాను చాటేందుకు తాపత్రయ పడుతున్నాయి. సత్తెనపల్లి- గుంటూరు వెస్ట్- తెనాలి… ఎటుచూసినా పాదయాత్రలే పాదయాత్రలు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమరపూడిలో మహా పాదయాత్ర పేరుతో హంగామా చేసింది జనసేన. కొమెరపూడి ఆంజనేయుడి గుడిలో, ఎర్రగుంటపాడు నాగేంద్ర స్వామి గుడిలో పూజలు చేశారు జనసేన నేతలు. ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగమేనంటూ జనసేన సమన్వయకర్తలు చెప్పినప్పటికీ.. ఇది కచ్చితంగా బల ప్రదర్శనే అంటోంది అవతలిపార్టీ.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా జనంతో జనసేన పేరుతో పాదయాత్ర చేశారు జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్. అటు.. ఏపీ వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన నేతల పాదయాత్రలు కొనసాగుతున్నాయి. మరోవైపు తెనాలి టికెట్ విషయంలో టీడీపీ, జనసేన మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తెనాలి టికెట్ జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కి ఇయిస్తారన్న ప్రచారం నేపథ్యంలో పాదయాత్ర చేశారు టీడీపీ నేత ఆలపాటి రాజా. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూనేఒత్తిడి పెంచేలా స్కెచ్ వేస్తున్నారు. ఇలా…టీడీపీ-జనసేన మధ్య సమన్వయం ఉందంటూనే విడివిడిగా పాదయాత్రలు చేయడం ఆసక్తికరంగా మారింది.
అనంతపురం జిల్లాలో ఐతే టీడీపీ నేతల మధ్యే టికెట్ల చిచ్చు రాజుకుంది. కాల్వ శ్రీనివాసులుకు అనంతపురం ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరగడంతో.. ఆయన వర్గం గుర్రుగా ఉంది. డి. హీరేహల్ మండలంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కాల్వ శ్రీనివాసులు. రాయదుర్గం వదిలి ఎక్కడికీ తేల్చేశారు. కాల్వ తీరుతో అధినేతకు ఇరకాటం తప్పేలా లేదు. సరిగ్గా ఇక్కడే కొత్త లాజిక్‌తో ముందుకొచ్చింది జేసీ వర్గం. ఒకవేళ రాయదుర్గం టికెట్ కాల్వ శ్రీనివాసులుకు ఇవ్వని పక్షంలో తన వారసుడు దీపక్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలన్నది జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రపోజల్. కానీ.. దీపక్‌రెడ్డి విషయంలో సుముఖంగా లేమంటూ ఇప్పటికే అధిష్టానం నుంచి సంకేతాలొచ్చాయి.
అనంతపురం జిల్లాలో సింగనమల సెగ్మెంట్‌లో పరిస్థితి ఇంకా విభిన్నం. ఇక్కడ అసమ్మతి పోరును ఎదుర్కోవడం వైసీపీ వంతయింది. శింగనమల ఇన్‌చార్జ్‌గా వీరాంజనేయులు నియామకాన్ని మార్చాల్సిందే అంటూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు స్థానిక వైసీపీ అసమ్మతి నేతలు. ఎవరికిపడితే వారికి టికెట్ ఇస్తే సహకరించేదే లేదు అంటూ అడ్డం తిరిగిన సింగనమల అసమ్మతి నేతలపై వైసీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కొందరు పాదయాత్రలతో, మరికొందరు ప్రత్యేక సమావేశాలతో ఇలా.. అభ్యర్థుల ఎంపిక అనే ఎపిసోడ్‌తో అన్ని పార్టీల్లోనూ అగ్గిరాజుకుంది.