అభ్యర్థుల ఎంపిక విషయంలో పవన్ కళ్యాణ్ ఒక అంచనాకు వచ్చేసారా అంటే అవుననే అనిపిస్తుంది. టీడీపీతో పొత్తు పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కోసం అనేక నిర్ణయాలు తీసుకొంటున్నారు పవన్.. పొత్తును విమర్శించే వారికి పార్టీలో చోటు లేదంటూనే.. వాళ్లు వైసీపీతో టచ్‌లో ఉన్నట్టు భావిస్తానని పవన్ పేర్కొంటున్నారు. అవసరమైతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవటంలో కూడా వెనకడుగువేయనని స్వీట్ వార్నింగ్ సైతం ఇచ్చారు. ఏపీలో పొత్తుల విషయంలో సొంత పార్టీలో నెలకొన్న వివాదాలు, విభేదాలు, విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్న సేనాని ఇటీవల నియోకవర్గ స్థాయి జనసేన పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు సైతం చేశారు.
భేటీ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న పార్టీ పరిస్థితి, సామాజిక రాజకీయ పరిణామాల దృష్ట్యా అన్ని అంశాలను అడిగి తెలుసుకున్న పవన్ తన వైఖరిని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ముఖ్యంగా పొత్తు విషయంలో పార్టీలోని కొందరు నేతలు చేస్తున్న విమర్శలను సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా జరిగిన పరిణామాలను ఆధారంగా చేసుకుని ఆయా నియోకవర్గాల్లోని నేతలకు కొన్ని సూచనలు చేశారు. మొదట టీడీపీతో పొత్తు అధికారం కోసమే కాదని రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం అని పార్టీ ముఖ్య నేతలకు వివరించారు. జనసేన పార్టీలో నేతల మధ్య నడుస్తున్న పొత్తు వివాదంపై దృష్టి సారించిన పవన్ కళ్యాణ్.. టీడీపీతో కలిసే వెళ్తామని తాడో పేడో వైసీపీతో తెల్చుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీని గద్దె దించేందుకు టీడీపీతో కలిసి అడుగులు వేస్తున్నామని.. తన నిర్ణయాన్ని వ్యతిరేకించే ఎవ్వరూ అయినా ఉపేక్షించేది లేదంటూ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో పొత్తు విషయం క్లారిటీ ఉండి కలిసిమెలసి వెళ్ళే వాళ్లకే టికెట్లు ఇస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత ఎన్నికల ఫలితాలు పరిణామాల ఆధారంగా ఇకపై తన నిర్ణయాన్ని పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉంటుందని, గెలుపు ఓటముల ఆలోచించకుండా టికెట్లను ఇచ్చి పార్టీని పణంగా పెట్టడం మంచిది కాదని పవన్ కళ్యాణ్ సూచించినట్లు సమాచారం..
సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో 2019 నాటి పరిస్థితులు పునరావృతం కావని పవన్ కల్యాణ్ నేతలకు తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల మాదిరిగా ఇచ్చినట్లు టికెట్లను కేటాయించనని చెప్తూనే గత ఎన్నికల్లో ఉదారతతో కొంతమందికి పార్టీ టిక్కెట్లు ఇచ్చి నష్ట పోయామని నేతలకు వివరించారు. పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్న నేతలు ఎవ్వరూ అయినా ఒక్కొక్క అభ్యర్ధి వ్యక్తిగతంగా 10 నుంచి 15 వేల ఓట్లు తెచ్చుకోవాలన్నారు. అలాంటి నేతలకు మాత్రమే టికెట్స్ ఇస్తామని అలాగే తెలుగుదేశం పార్టీతో సయోధ్యతో ప్రయాణం చేసేవారికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. గత ఎన్నికల్లో బరిలో నిలిచి డిపాజిట్లు కూడా కొందరు నేతలు తెచ్చుకోలేదని మరోసారి అటువంటి పరిస్థుతులు పునరావృతం కాకుండా వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ నేతలకు స్పష్టం చేశారు. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీని ఎదుర్కొవాలంటే ఇప్పుడున్న బలం సరిపోదని అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఇప్పటికే చంద్రబాబుతో జరిగిన భేటీలో పలు అంశాలపై ఒక అంచనాకు వచ్చామని, కానీ పొత్తుల విషయంలో ఎవ్వరూ నోరు జారొద్దంటూ పార్టీలోని నేతలకు సూచించారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎలాగైనా టీడీపీ, జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు. దీనికోసం ఉన్న అవకాశాలపై టీడీపీతో కలిసి ఫోకస్ పెట్టారు. ఇప్పటికే టీడీపీతో పొత్తు కొనసాగుతున్న వేళ మరిన్ని వ్యూహాలను అమలు చేయాలని భావిస్తున్నారు. తాజాగా.. యువగళం పాదయాత్రలో కూడా పవన్ కల్యాణ్ అదే విషయాన్ని ప్రస్తావించారు. టీడీపీ-జనసేన పొత్తు అనివార్యం.. ఆవశ్యకం అన్నారు.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న తన ఆలోచన సరైందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..