Chandrababu letter to CM Jagan : కుప్పం రెస్కోను APSPDCL స్వాధీనం చేసుకోవడం ఏకపక్ష చర్యన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. స్థాపించిన నాటి నుంచి విజయవంతంగా నడుస్తున్న కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌ని APSPDCLకి అప్పగించడం సరికాదన్నారు. ఏపీ ప్రభుత్వంనుంచి విద్యుత్ అమ్మకం, పంపిణీ, రిటైల్ లైసెన్స్ మినహాయింపు పొందడంలో విఫలమైందనే కారణం చూపి…నియోజకవర్గప్రజలతో అనుబంధమున్న సంస్థను దెబ్బతీయడం సరికాదంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి లేఖరాశారు చంద్రబాబు.
చిన్న కారణాన్ని చూపుతూ రెస్కోను APSPDCLలో విలీనం చేయడం అర్థం లేని పనన్నారు చంద్రబాబు. APERC ఆకస్మిక నిర్ణయంతో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం వాసులు నిరాశకు గురవుతున్నారన్న చంద్రబాబు.. రెస్కో స్వాధీనానికి జారీ చేసిన ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని కోరారు. కుప్పం రెస్కోకు లైసెన్స్ మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీచేయాలని సీఎంని కోరారు.
1981లో అప్పటి ఎమ్మెల్యే చొరవతో కుప్పం గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థ ఏర్పాటైంది. ప్రజలకు అందుబాటులోకి విద్యుత్తు సేవలు తేవడంతోపాటు వందశాతం విద్యుద్దీకరణ లక్ష్యంతో ఏర్పాటైన కుప్పం రెస్కో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఇన్నేళ్లూ నెట్టుకొచ్చింది. విద్యుత్తు సమస్యలను పరిష్కరిస్తూ వినియోగదారులకు సేవలందించే బాధ్యత రెస్కోలది. ఎస్పీడీసీఎల్ దగ్గర విద్యుత్తు కొని తన పరిధిలోని ప్రాంతాల వినియోగదారులకు పంపిణీ చేయాల్సిన బాధ్యత రెస్కోలది, ఈ వ్యవహారాలు నిర్వహించుకోవడానికి ఏటా రెస్కోలు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కి దరఖాస్తు చేసుకోవడంతోపాటు నిర్ణీత ఫీజు చెల్లించి లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. కుప్పం రెస్కో ఈసారి కూడా దరఖాస్తు చేసుకున్నా…ఏపీఈఆర్సీ వెనక్కు పంపింది. రెస్కోల బాధ్యతలను టేకోవర్ చేసుకోవాల్సిందిగా తిరుపతి ఎస్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హరనాథ రావుకు ఏపీఈఆర్సీ సెక్రటరీ నుంచి ఆదేశాలు అందాయి. లైసెన్సు ఇవ్వమని, లేదా లైసెన్సు నుంచి మినహాయింపు ఇవ్వమని ప్రభుత్వంనుంచి తమకు ఎలాంటి సిఫార్సు అందకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది తక్షణం అమల్లోకి వస్తుందని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. జనవరి 12తో ముగిసిన రెస్కో పాలకమండలి పదవీ కాలాన్ని జూన్ 12 వరకు పొడిగించిన ప్రభుత్వం…రెస్కోను రద్దు చేస్తే ప్రజా ఉద్యమం తప్పదని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. రెస్కో రద్దు ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని డిమాండు చేస్తూ టీడీపీ, కాంగ్రెస్ ధర్నాలు చేశాయి. రెస్కో రద్దును ఆపాలంటూ సంస్థ ఎండీకి వినతిపత్రం సమర్పించాయి. కుప్పం రెస్కోను డిస్కంకు అప్పగిస్తూ ఈపీఈఆర్సీ ఛైర్మన్ మాత్రమే ఆదేశాలు ఇచ్చారని, అందులో ప్రభుత్వ ప్రమేయం లేదంటోంది వైసీపీ. ఈ ఉత్తర్వులు నిలిపివేసేలా ఒత్తిడితెస్తామంటున్నారు కుప్పం వైసీపీ నేతలు.