Tanuku: అయ బాబోయ్.. చూశారా ఈ చిత్రం.. హస్తానికి 80 పళ్లు

అరటి పండు ఆరోగ్యానికి మంచిది . ప్రతి రోజు 2 పండ్లు తింటే ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని వైద్యులు కూడా చెబుతుంటారు. ఐతే మనకు సాదరంగా కనిపించే అరటిగెలలలో హస్తానికి ఎన్ని కాయలు ఉంటాయి అంటే.. సహజంగా అవగాహన ఉన్నవాళ్లు 12 నుంచి 14 కాయలు ఉంటాయి అని చెబుతారు. ఐతే తణుకులో విచిత్రంగా ఒక అరటిగలలో హస్తానికి ఏకంగా 80 కాయలు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Tanuku: అయ బాబోయ్.. చూశారా ఈ చిత్రం.. హస్తానికి 80 పళ్లు
Banana Bunch 80 Fruits

Edited By: Ram Naramaneni

Updated on: Nov 07, 2025 | 5:40 PM

తణుకు పట్టణంలో నాని అనే వ్యక్తి తన తోటలో కాసిన అరటిపళ్లనే స్థానికంగా విక్రయిస్తూ ఉంటారు. తాజగా ఆ తోటలో కాసిన అరటిగెలను చూసి ఆయన నివ్వెరపోయాడు. గత 30ఏళ్లకు పైగా ఈ వ్యాపారం చేస్తున్నానని సాధరణంగా కర్పూరం వంటి రకానికి అరటిగెలలోని హస్తానికి 14 నుంచి 18 వరకు మాత్రమే పళ్లు ఉంటాయని మహా అయితే 20 వరకు వస్తాయని ఆయన చెబుతున్నారు. కానీ మూడు రెట్లు ఎక్కువగా ఏకంగా 80 కాయలు రావడంతో పండించిన రైతు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి.

ఇక హస్తానికి 80 కాయలు ఉన్న విషయం బయటకు తెలియటంతో పలువురు వచ్చి దాన్ని చూడటంతో పాటు సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఈ విషయంపై ఉద్యానశాఖ అధికారిణి ప్రియదర్శిని మాట్లాడుతూ… తణుకు, పెరవలి పరిసర ప్రాంతాలు అరటి సాగుకు అనుకూలమైన నేల స్వభావాన్ని కలిగివున్నాయన్నారు. సాధరణంగా ఇక్కడ కాసే అరటిగెలలు పొడవుగా వుంటాయని ఆమె చెబుతున్నారు. అయితే నేలలో పోషకాలు అధికమైనప్పుడు ఈ విధంగా హస్తానికి సాధారణం కంటే భిన్నంగా కాయలు వచ్చే అవకాశం ఉందని ఆమె చెబుతున్నారు. గాలులకు చెట్లు పడిపోవడంతో అప్పుడు మొక్కలకు వేసిన న్యూట్రియంట్స్ నేలలో ఉండిపోతాయని..  మరోసారి మొక్క ఎదిగినప్పుడు రైతు మరల వేసే న్యూట్రియంట్స్‌తో కొత్త మొక్కకు అదనపు బలం చేకూరుతుందని అంటున్నారు.  అలాంటి మొక్కలకు పోషకాలు ఎక్కువై అధిక పళ్లు కాసే సందర్భాలు ఉంటాయని ఆమె చెప్పారు.