AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: రాయచోటిలో మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాల అరెస్ట్.. ఇళ్లలో ఉన్న వాటిని చూసి కంగుతిన్న పోలీసులు..

గత రెండు రోజులుగా అన్నమయ్య జిల్లా రాయచోటి లోని కొత్తపల్లి ప్రాంత ప్రజలు హడలెత్తిపోతున్నారు. వారి మధ్య మామూలుగా తిరిగిన ఇద్దరు మనుషులు ఉగ్రవాదులు అని తెలిసేసరికి స్థానికంగా ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గత రెండు రోజుల క్రితం ఇద్దరు ఉగ్రవాదులను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకోవడంతో టెర్రరిస్టుల ఉనికి బయటపడింది.

Andhra News: రాయచోటిలో మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాల అరెస్ట్.. ఇళ్లలో ఉన్న వాటిని చూసి కంగుతిన్న పోలీసులు..
Tn Police
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Jul 03, 2025 | 11:46 AM

Share

అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాద కదలికలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ప్రాంతంలో ఉగ్రమూకల కదలికలను గుర్తించిన తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ ఇటీవల ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్‌ చేసింది. వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత నిందితుల ఇళ్లలో తమిళనాడు పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసుల సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల నివాసాల్లో భారీ పేలుళ్లకు ఉపయోగించే..పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు, వాకీటాకీలు, పేలుడుకు వాడే వైర్లు లభ్యమైనట్లు తెలుస్తుంది. పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులలో ఒకరు అబూబకర్ సిద్దిక్‌, మహమ్మద్ అలీగా తమిళనాడు పోలీసులు గుర్తించారు. అయితే వీరు తమిళనాడులో మారు పేర్లతో తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అక్కడ అబూబకర్ సిద్దిక్ తన పేరును అలియాస్ నాగూర్‌గా, మహమ్మద్ అలీ తన పేరును మేళపలయంగా చెప్పుకొని తిరుగుతున్నట్టు పోలీసులు పసిగట్టారు.

అయితే ఈ ఇద్దరు ఉగ్రవాదులు గత పదేళ్ళ క్రితం రాయచోటి ప్రాంతానికి ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే రాయిచోటికి వచ్చిన తరువాత తమపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు.. స్థానికంగా ఉన్న పేద మహిళలను ఎంచుకొని వారిని వివాహం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. కాగా తాజాగా విరి కదలికలను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వారి నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్లోని డేటా ఆధారంగా వారు ఎవరితో ఎక్కువసేపు మాట్లాడారు, వారు ఇక్కడకు ఎవరి ద్వారా వచ్చారు, వారికి ఎవరికి సహాయం చేస్తున్నారు అనే విషయాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

అన్నమయ్య జిల్లాలో అరెస్ట్ అయిన ఇద్దరు ఉగ్రవాదులను తమిళనాడు యాంటీ టెటరిజం స్క్వాడ్ పోలీసులు తమిళనాడులోని న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. అయితే వీరు పాల్గొన్న ఉగ్ర దాడి విషయాలను పరిశీలిస్తే 1995లో చెన్నై చింతాద్రిపేటలో హిందూ మున్నాని కార్యాలయంలో బాంబు పేలుడు , 1995లో నాగూరులో పార్సిల్ బాంబు పేలుడు అందులో తంగం అనే వ్యక్తి మరణం , 1999లో చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు, కేరళ ప్రాంతాలలోని ఏడు చోట్ల బాంబులు ఉంచిన సంఘటనలో వీరు నిందితులుగా ఉన్నారు. అంతేగాక చెన్నైలో పోలీస్ కమిషనర్ కార్యాలయం లక్ష్యంగా బాంబులు కూడా పెట్టినట్లు సమాచారం. 2011లో మధురైలో ఎల్కే అద్వానీ రథయాత్ర సమయంలో పైపు బాంబుకు సంబంధించి వీరు నిందితులుగా ఉన్నారు.

అంతే కాకుండా 2012లో వెల్లూరులో డాక్టర్ అరవింద రెడ్డి హత్య, 2013లో బెంగళూరు మల్లేశ్వరం లోని బిజెపి కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు కేసులో కూడా వీరు నిందితులగా ఉన్నారు . వీరు ఇరువురు 1995 సంఘటన తర్వాత అజ్ఞాతంలోకి వచ్చేసి రాయచోటి ప్రాంతంలోని కొత్తపల్లి ప్రాంతానికి చేరుకొని అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే వీరికి అక్కడికి రావడానికి సహకరించింది ఎవరు? వీరు అక్కడికి వచ్చిన తరువాత కూడా ఎటువంటి ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించారు అనే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. అయితే వీరి ఇరువురు కొత్తపల్లి ప్రాంతంలో దొరకడంతో స్థానికంగా ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వీరే కాకుండా మరో వ్యక్తి కూడా రాయచోటి ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.