Andhra Pradesh: తాడిపత్రిలో రాజకీయం వేడెక్కింది. క్షణక్షణం హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అలాగని, ఇదేదో ఇద్దరు నాయకుల మధ్య పొలిటికల్ వార్ కాదు. ఖద్దరుకు, ఖాకీకీ మధ్య ముదిరిన జగడం. ఇప్పుడు బజారుకెక్కింది. అవును, అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఖాకీ వర్సె్స్ ఖద్దర్ లా మారింది పరిస్థితి. డీఎస్సీ చైతన్యపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫుల్ ఫైర్ అవుతున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్కెక్కారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మున్సిపల్ స్థలంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కట్టడాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఈ క్రమంలో డీఎస్సీ చైతన్యను ఆయన టార్గెట్ చేశారు. నడిరోడ్డుపై నల్లడ్రెస్సుతో ప్రభాకర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ స్థలంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను కట్టొద్దని డిమాండ్ చేస్తున్నారు. మరో మూడు స్థలాలు ఉన్నప్పటికీ.. అక్కడే ఎందుకు కడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అంతటితో ఆగకుండా.. డీఎస్సీ చైతన్యపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మరోవైపు డీఎస్సీ చైతన్యపై జేసీ అనుచరులు ప్రైవేట్ కేసులు పెడుతున్నారు. అయితే, డీఎస్సీ చైతన్యను జేసీ ఇంతగా టార్గెట్ చేసుకోవడానికి వేరే కారణాలున్నాయని పొలిటికల్ టాక్ నడుస్తోంది. బస్సు పర్మిట్ల కేసులో ఆధారాలు సేకరించినందుకు, చార్జిషీట్ విషయంలో డీఎస్సీపై ఒత్తిడి చేసిన తలొగ్గనందుకే జేసీ ఇలా డీఎస్సీ చైతన్యను టార్గెట్ చేసుకున్నారనే ప్రచారం తాడిపత్రిలో జరుగుతోంది. మరి ఈ వివాదం ఇంకెంత ముదురుతుందో వేచి చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..