NTR District: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఉయ్యాలే ఉరితాడయ్యింది. పాపను నిద్రపుచ్చేందుకు వాడిన ఊయలే.. చిన్నారిపాలిట యమపాశమైంది. చీర ఊయల.. చిన్నారిని శాశ్వత నిద్రలోకి పంపింది. చీర మెడకు చుట్టుకుని చిన్నారి విలవిల్లాడుతూ మృతి చెందింది. చిన్నారి మృతి పలువురిని కంటతడి పెట్టిస్తోంది. పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట(Nawabpet)లో గోపి, తిరుపతమ్మ దంపతులకు లలితశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి ఉంది. చిన్నారిని జోలపుచ్చేందుకు తల్లి చీరను ఊయలగా మార్చింది. ఆ ఊయలో లలితశ్రీని పడుకోబెట్టింది. హాయిగా ఆడుకుంటున్న చిన్నారిని చూసి మురిసిపోయింది. ఆడుకుంటుంది కదా.. ఇక పనిచేసుకోవచ్చని అక్కడి నుంచి బయటకు వెళ్లింది. ఊయలతో ఆడుకుంటున్న చిన్నారి మెడకు ఒక్కసారిగా చీర బిగుసుకుపోయింది. విడిపించుకునేందుకు విలవిల్లాడింది. ఊపిరాడక మృత్యు ఒడికి చేరుకుంది.
కాసేపటి తర్వాత చలనంలేకుండా ఉన్న చిన్నారిని చూసిన తల్లి తల్లడిల్లింది. వెంటనే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించడంతో తల్లి ఆవేదన అంతాఇంతా కాదు. చిన్నారిపై పడి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..