
నేచురల్ ఫార్మింగ్‌పై రోజురోజుకు అవగాహన పెరుగుతోంది. ప్రకృతిని ధ్వంసం చేయకుండా సాగు చేపట్టాలన్న సంకల్పంతో రైతులు నేచురల్ ఫార్మింగ్ పై ద్రుష్టి సారిస్తున్నారు. అయితే గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోటకు చెందిన రైతు బాపారావు వినూత్న సాగుతో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నాడు. పర్యావరణ సమత్యులత కాపాడాలంటే ప్రక్రుతి వ్యవసాయం ఒక్కటే మార్గం అంటూ రైతులకు వివరిస్తున్నాడు. ఇందులో భాగంగా తన పంట పొలంలో ప్రకృతి వ్యవసాయం చేద్దాం.. భూమాతకు జీవం పోద్దాం అంటూ అక్షరాల రూపంలో సాగు చేపట్టాడు.
నలభై రోజుల క్రితం ముప్పై రకాల విత్తనాలతో బాపారావు చేపట్టిన సాగు ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. అక్షరాల మధ్యలో ఆంద్రప్రదేశ్ మ్యాప్ రూపంలో మరొక పంటను సాగు చేశాడు. దీంతో వ్యవసాయ క్షేత్రంలో అక్షరాలు, మ్యాప్ కనువిందు చేస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి వినూత్న సాగు చేపట్టిన రైతు.. ప్రకృతి వైపరిత్యాలను తట్టుకోవాలంటే నేచురల్ ఫార్మింగ్ ఒక్కటే శరణ్యమని అంటున్నాడు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు రైతులంతా ప్రకృతి సేద్యం వైపు వెళ్లాలని సూచిస్తున్నాడు. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రకృతి సేద్యంతో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చన్నారు. ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు కూడా సాధించవచ్చంటున్నాడు.
అత్తోటలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయాన్ని తెలుసుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి ఔత్సాహిక రైతులు, అగ్రికల్చర్ విద్యార్ధులు విచ్చేస్తున్నారు. రైతు పొలంలో ఉన్న ఆకారాలను చూసి మరిన్ని వివరాలను తెలుసుకుంటున్నారు. మున్ముందు రోజుల్లోనూ ఇలా అవగాహన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు రైతు బాపారావు తెలిపాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..