AP News: ఉమ్మడి కృష్ణా జిల్లా అంతటా విజృంభిస్తున్న విషజ్వరాలు

|

Aug 07, 2024 | 5:29 PM

విజయవాడపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. చిక్కిన వారిని చిక్కినట్టు కసిదీరా కుడుతున్నాయి. విరామమన్నది లేకుండా పగలూ, రాత్రి తేడా లేకుండా వీరవిహారం చేస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జనం రోగాల బారిన పడుతూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దోమలను నియంత్రించాల్సిన సంబంధిత శాఖలు నిర్లక్ష్యం వహిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

AP News: ఉమ్మడి కృష్ణా జిల్లా అంతటా విజృంభిస్తున్న విషజ్వరాలు
Fever Cases
Follow us on

విజయవాడ సిటీతో సహా ఉమ్మడి కృష్ణా జిల్లా అంతటా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రాణాంతక డెంగ్యూతో జనం అవస్థలు పడుతున్నారు. దీనికితోడు మలేరియా కేసులు కూడా విపరీతంగా నమోదవుతున్నాయి. అసలే వర్షాకాలం.. దీనికి తోడు ఇటీవల వానలు బాగా కురిశాయి. దీంతో దోమల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. వీటి నుంచి తప్పించుకోవటం సామాన్యులకు సాధ్యం కావటం లేదు. సంబంధిత శాఖ అధికారులు దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 9వందల డెంగ్యూ కేసులు నమోదైనట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డెంగీతోపాటు మలేరియా కేసులు కూడా పెరిగిపోతున్నాయి. జిల్లా వైద్యారోగ్య శాఖ కూడా తన స్థాయికి తగ్గట్టు వ్యవహరించడం లేదన్న విమర్శలున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలకు రోజుల తరబడి ముసురు పట్టి పీడిస్తున్నది. సరిగా ఎండలు లేకపోవడం, ఎక్కడ పడితే అక్కడ వర్షం నీరు నిలిచిపోవటం, మురికినీరు రోడ్లపై పారటం దోమల అభివృద్ధికి దారి తీసింది. పల్లెలు, పట్నాలు అన్న తేడా లేకుండా జిల్లా అంతటా ఇదే పరిస్థితి. అన్ని చోట్లా దోమల బెడదతో జనం అవస్థలు పడుతున్నారు.

సాయంత్రం నాలుగు గంటల నుంచి దోమల దాడి మొదలవుతున్నదని, వీటి దండయాత్రతో రాత్రంతా జాగారాం చేయాల్సి వస్తున్నదని ప్రజలు వాపోతున్నారు. దోమల బారి నుంచి తప్పించుకోవటానికి జనం ఆల్‌ అవుట్‌లు, గుడ్‌ నైట్‌లు, మస్కిటో కాయిల్స్‌ ఎన్ని ఉపయోగిస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదంటున్నారు. గతంలో ఇవి కొంత వరకు ప్రభావం చూపించేవి. ఇప్పుడు ఆ కాస్త ప్రభావం కూడా తగ్గిపోయింది. మార్కెట్లోకి ఏ కొత్త దోమల నివారిణి వచ్చిన జనం ఎగబడేటట్టున్నారు. వీటి కోసం వేలల్లో ఖర్చు చేస్తున్నారు. అయినా ఫలితం ఉండటం లేదని ఆరోపిస్తున్నారు. దోమల నివారణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని పబ్లిక్‌ కోరుతున్నారు.

దోమల విజృంభణతో డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. వందల్లో డెంగ్యూ కేసులుండగా.. వేలల్లో మలేరియా కేసులు నమోదవుతున్నట్టు రికార్డులు చెబుతున్నారు. ప్రతి రోజూ వేలాది మంది ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రైవేట్‌ ల్యాబ్స్‌లో వేలకు వేలు ఖర్చు చేసి రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ జ్వరాలకు సంబంధించిన పూర్తి లెక్కలు అధికారుల దగ్గర ఉండటం లేదు. కాబట్టి వారికి జ్వరాల తీవ్రత కూడా అర్థం కావటం లేదు.  డెంగ్యూ ఫీవర్‌ చాలా డేంజరస్‌ అంటున్నారు డాక్టర్లు.. దీన్నే బోన్‌ బ్రేక్‌ ఫీవర్‌ అని కూడా అంటారని, నొప్పులు ఆ స్థాయిలో ఉంటాయంటున్నారు.

వర్షాకాలం రాక ముందు నుంచే సంబంధిత అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోగా.. రోగాలు విజృంభిస్తున్నా కూడా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..