మండే ఎండల నుంచి ఏపీ ప్రజలకు ఉపశమనం కలిగింది. పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. గత మూడు, నాలుగు రోజులుగా ఏపీలో ఎండలు తెగ మిడిసిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో 48, 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. కానీ.. సడెన్‌గా వాతావరణం చేంజ్ అయ్యింది. గురువారం పలు జిల్లాల్లో వర్షం కురవడంతో ప్రజలు కాస్త రిలాక్సయ్యారు. తిరుమలలో వర్షం దంచికొట్టింది. భారీ వర్షంతో శ్రీవారి ఆలయ చుట్టుపక్కల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. క్యూలైన్లలోకి వర్షపు నీరు చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్సులు నిండిపోవడంతో.. భక్తుల లైన్లు ఆలయ వెలుపల వరకూ వచ్చాయి. ఇలాంటి సమయంలో భారీ వర్షం కురవడంతో భక్తులు అవస్థలు పడాల్సి వచ్చింది.
చిత్తూరు జిల్లాలోని కుప్పంలోనూ భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్ష బీభత్సం సృష్టించింది. మరోవైపు.. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. విశాఖ, అరకు మార్గంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. పెద్ద పెద్ద చెట్లు, కరెంట్ స్థంభాలు రోడ్లకు అడ్డంగా పడిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
అలాగే.. మిగతా జిల్లాలోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఇదిలావుంటే.. రాబోయే రెండు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని, రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. మొత్తంగా.. కొద్దిరోజులుగా ఎండలతో ఇబ్బందిపడుతున్న ఏపీ ప్రజలు.. వరుణుడి కరుణతో కాస్త ఉపశమనం పొందుతున్నారు.
మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..