
ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 7: టమాటా నిన్న మొన్నటిదాకా ఈ పేరు వింటేనే భయపడే పరిస్థితి. పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు.. టమాటాను వాడటమే ఆపేశారు. ఇటీవల మదనపల్లి మార్కెట్‌లో ఏకంగా కిలో టమోటా ధర డబుల్ సెంచరీ కొట్టింది. దీంతో టమాట ధనవంతుల ఇంటి కూరగా మారిపోయింది. అయితే ఈ పరిస్థితుల నుంచి బయట పడేలా మదనపల్లి మార్కెట్‌కు టమాట దిగుబడి పెరిగింది. దీంతో ధర డౌన్ అవుతూ వస్తుంది. అన్నమయ్య జిల్లాలో ప్రత్యేకించి మదనపల్లి ప్రాంతంలో విస్తారంగా సాగుచేసే టమాటా ఈసారి రైతుకు టమోటా కాసుల పంట పండించింది. మేలు రకం టమోటా ఏ గ్రేడ్ ధర ఊహకు అందని రీతిలో ఎగబాకింది. ఏకంగా రూ. 200 కు పైగానే ధర పలికింది. దీంతో రైతుల పంట పండింది. అయితే ఇప్పుడు మదనపల్లి టమోటా దిగుబడులు షురూ కావడంతో టమోటా రికార్డ్ ధరలకు బ్రేకులు పడుతున్నాయి.
మదనపల్లి మార్కెట్‌లో రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. ఇతర ప్రాంతాలు, జిల్లాల్లో టమోటా దిగుబడి రావడంతో రేట్స్ డౌన్ ఫాల్ అవుతున్నాయి. మదనపల్లి టమోటా మార్కెట్ కు పెరిగిన టమోటా దిగుబడితో ధరపై ప్రభావం పడింది. ఆదివారం మదనపల్లి మార్కెట్ కు అమ్మకానికి 404 మెట్రిక్ టన్నుల టమోటాలు రాగా.. సోమవారం కూడా అదే స్థాయిలో అరైవల్స్ వచ్చాయి. ఆదివారం కిలో ఏ గ్రేడ్ కిలో టమోటా అత్యధిక ధర.. రూ 116లు పలకగా.. సోమవారం కూడా అదే రీతిలో టమోటా ధర ఉండే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. గత నెల 29, 30న కిలో టమాట ధర రూ. డబుల్ సెంచరీ పలికిన విషయం విధితమే. అటు కర్నూలులో కూడా టమోటా ధరల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. నాలుగు రోజుల్లో భారీగా పతనమైంది టమోటా ధర. కర్నూలు రైతు బజార్లో కిలో టమోటా 60 రూపాయలు లభిస్తున్నాయి అంటే రేటు ఎంత డౌన్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే రైతు బజార్లో నాలుగు రోజుల క్రితం కిలో టమోటా 140 రూపాయలు పలికింది.
నిన్నమొన్నటి వరకు చికెన్, చేపల ధరలతో టమాటా పోటీ పడింది. టామోటాను వండుకోవడం దాదాపు మర్చిపోయే పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో పేదల కష్టాలు తొలగించేందుకు జగన్ సర్కార్ రంగంలోకి దిగింది. రైతుల నుంచి నేరుగా టమాటాను కొనుగోలు చేసి, రైతు బజార్లకు తరలించింది.. తక్కువ ధరకు అమ్మకాలు జరిపింది.CM ఆదేశాలతో కదిలిన అధికారులు అనంతపురం మార్కెట్ యార్డుల్లో రైతుల నుంచి కిలో 50 నుంచి 55 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. వాటిని పలు జిల్లాల్లో రైతు బజార్ల ద్వారా 50 రూపాయలకు విక్రయించారు. రేషన్ పద్ధతిలో ఒక్కో వినియోగదారుడికి కేజీ టమోటా చొప్పున విక్రయించారు అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..