Ashram Schools: పాపం పసివాళ్లు.. అధికారుల నిర్లక్ష్యం వల్ల పిట్టల్లా రాలుతున్న చిన్నారులు

పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. జిల్లాలో ఎక్కడో ఒకచోట విద్యార్థులు అనారోగ్యానికి గురై పిట్టల్లా రాలుతున్నారు. ఏ స్కూల్లో ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియక భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు తల్లిదండ్రులు. జిల్లాలోని ఆశ్రమ పాఠశాల్లో వరుసగా కొనసాగుతున్న విద్యార్థుల మరణాలతో అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు.

Ashram Schools: పాపం పసివాళ్లు.. అధికారుల నిర్లక్ష్యం వల్ల పిట్టల్లా రాలుతున్న చిన్నారులు
Gurukulam

Edited By:

Updated on: Feb 23, 2024 | 8:11 PM

పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. జిల్లాలో ఎక్కడో ఒకచోట విద్యార్థులు అనారోగ్యానికి గురై పిట్టల్లా రాలుతున్నారు. ఏ స్కూల్లో ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియక భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు తల్లిదండ్రులు. జిల్లాలోని ఆశ్రమ పాఠశాల్లో వరుసగా కొనసాగుతున్న విద్యార్థుల మరణాలతో అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పించినా అధికారుల నిర్లక్ష్యం మాత్రం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మండిపడుతున్నారు తల్లిదండ్రులు.

మన్యం జిల్లాలోని ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో గిరిజన విద్యార్థులు అనారోగ్యంతో గడిచిన వారం రోజుల్లో ముగ్గురు చనిపోగా మరికొందరు అస్వస్థతతో చికిత్స పొందుతున్నారు. పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తూ వసతి గృహాల్లో ఉంటున్నారు. కేవలం గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గిరిజన పాఠశాలలు, హాస్టల్స్ లో ప్రభుత్వం అన్నిరకాల వసతులు కల్పించినా అధికారుల నిర్లక్ష్యం మాత్రం విద్యార్థులకు శరాఘాతంగా మారింది. విద్యార్థులకు బలమైన పౌష్టికాహారం కానీ, అనారోగ్య సమస్యలు తలెత్తితే సమయానుకూలంగా ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించడం కానీ చేయకపోవడమే విద్యార్థుల మృతికి కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే గడిచిన వారం రోజుల్లో ముగ్గురు విద్యార్థులు అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు.

మక్కువ మండలం ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలలో చోడిపల్లి అశోక్ అనే విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందగా, ఆ మరుసటి రోజే పాచిపెంట మండలం సరాయివలస గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి అనిత అనే బాలిక మృతి చెందింది. ఈ రెండు ఘటనలు మరువక ముందే గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి గురుకుల బాలికల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న శృతి అనే గిరిజన బాలిక అనారోగ్యంతో విశాఖపట్నం కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. చనిపోయిన ముగ్గురు విద్యార్థులు అనారోగ్యానికి గురైనా హాస్టల్ సిబ్బంది వెంటనే స్పందించి చికిత్స అందించకపోవడమే మృతికి కారణమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.

వసతి గృహాల్లో విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తగానే వైద్య సిబ్బంది అప్రమత్తం అయ్యి చికిత్స అందించడంతో పాటు తమకు సమాచారం ఇస్తే ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావని మండిపడుతున్నారు తల్లిదండ్రులు. జరిగిన విద్యార్ధుల మరణాలపై విచారణ జరిపి విద్యార్థుల మరణాలకు వార్డెన్ల నిర్లక్ష్యం కారణమని సంబంధిత రెండు వసతి గృహాల వార్డెన్లను సస్పెండ్ చేశారు జిల్లా అధికారులు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో అధిక శాతం విద్యార్థులు రక్తహీనతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ వారి బాగోగులపై దృష్టి పెట్టకపోవడంతో విద్యార్థులు తరుచూ అనారోగ్యానికి గురవుతున్నారని అంటున్నారు గిరిజన సంఘాల నాయకులు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…