Itlu Mee Niyojakavargam: ఎవరి ఈక్వెషన్స్ వారిది.. ఎవరి ధీమా ఏదైనా.. రాజమండ్రి రూరల్ ఓటర్ల మనసు దోచుకునే రారాజు ఆయనే..
రాజమండ్రి రూరల్ రాజకీయం రసకందాయంలో పడింది.... తెలుగు రాష్ట్రాల్లోని అతి కీలకమైన ఈ సీటులో టిడిపి, జనసేన నుండి బలమైన అభ్యర్థులే బరిలో ఉండడంతో... వైసిపి నుండి యువకుడు సవాల్ విసురుతున్నాడు.....గెలుపు ఎవరిదనే ఆసక్తి అందరిలోనూ ఆసక్తి రేపుతోంది

రాజమండ్రికి పొలిటికల్ రారాజు ఎవరంటే… నేను కాక ఇంకెవరు అంటారు గోరంట్ల బుచ్చయ్యచౌదరి. ఇది కేవలం గాలిమాట కాదు. దశాబ్దాలుగా ఆయన హవా అలాంటిదిక్కడ. టీడీపీ ఏర్పాటు చేయగానే తొలుత చేరిన నాయకుడిగా బుచ్చయ్యకు పేరుంది. అంటే.. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కంటే సీనియరన్నమాట. కమిటెడ్ పసుపు కార్యకర్త అనే బిరుదివ్వొచ్చు. అందుకే, 1995 ఆగస్టు సంక్షోభసమయంలోనూ ఎన్టీఆర్ పక్షానే నిలిచిన బుచ్చయ్య… ఆయన మరణించేంత వరకూ వెన్నంటే ఉన్నారు. తదనంతర పరిణామాలతో.. మళ్లీ చంద్రబాబు సైడొచ్చినప్పటికీ… తనదైన రాజకీయం చేస్తూ వస్తున్నారు. తొలుత రాజమండ్రిలో.. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడిన రాజమండ్రి రూరల్‌లోనూ తన పట్టు కొనసాగిస్తున్నారు.
2019లో అంతటి జగన్ వేవ్‌లోనూ… ఇక్కడ టీడీపీ జెండా ఎగిరిందంటే నియోజకవర్గంలోనూ బుచ్చయ్యకున్న పట్టేపాటిదో అర్థం చేసుకోవచ్చు. అటుపక్కన అర్బన్ నియోజకవర్గంలోనూ పసుపు జెండా రెపరెపలాడటానికీ ఇదే కారణమైందన్న అభిప్రాయమూ ఉంది. అయితే, మరోదఫా రూరల్‌లో రూలింగ్ నాదే అంటున్నారు ఈ సీనియర్ నేత. షరా మామూలుగానే వైసీపీ తేరుకున్నట్టు కనిపించకపోవడంతో… అందుకు అనువైన వాతావరణమూ కనిపిస్తోంది. కాకపోతే, వయసు మీదపడిన దృష్ట్యా ఈసారి ఆయనకు పోటీ అవకాశం లభిస్తుందా? లేదా? అన్నదే సంశయంగా మారింది.
గతంలో పార్టీ పదవుల విషయంలో బుచ్చయ్య అసంతృప్తి
యువనేత లోకేశ్ యువగళం అంటూ కొత్త నినాదం అందుకున్నారు. కుప్పం నుంచి పాదయాత్రనూ మొదలెట్టేశారు. దీంతో, వచ్చేసారి వృద్ధనేతలను పక్కనపెట్టి.. ఎక్కువ శాతం యువకులకే సీట్లు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆ లిస్టులో బుచ్చయ్య కూడా ఉంటే… ఆయన స్థానంలో యంగ్ లీడర్‌ను రంగంలో దింపే అవకాశం లేకపోలేదన్న ముచ్చటా వినిపిస్తోంది. టీడీపీకి ఎంత కమిటెడ్ లీడర్ కమ్ కార్యకర్తే అయినా.. పదవుల విషయంలో బుచ్చయ్య తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు. 2014-19 మధ్య చంద్రబాబు కేబినెట్‌లో అవకాశం రాకపోవడంతో.. పార్టీ రాష్ట్రస్థాయి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ… నియోజకవర్గానికే పరిమితమైపోయారు. 2021లో ఏకంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే, చంద్రబాబు రంగంలోకి దిగి బుజ్జగించడంతో చల్లబడ్డారు. అయితే, ఇప్పడు ఏకంగా తన సీటుకే ఎసరు పెడితే… ఎలా రియాక్టవుతారోనన్న భయం టీడీపీ వర్గాలను వెంటాడుతోంది.
బరిలో ఉండేది టీడీపీనా? జనసేనా?
పొత్తుల సంగతి ఇంకా తేలకపోవడం కూడా… టీడీపీకి మరో సమస్య అయ్యేలా ఉంది. ఎందుకంటే, ఇక్కడ జనసేన సైతం.. పోటీకి సై అంటోంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన కందుల దుర్గేశ్.. జనసేనలో యాక్టివ్‌గా తిరుగుతున్నారు. ఒకవేళ ఈసారి పొత్తు కుదిరితే.. రాజమండ్రి రూరల్ సీటును జనసేన అడిగే అవకాశం కనిపిస్తోంది. కంచుకోటలాంటి ఈ స్థానాన్ని టీడీపీ వదులుకుంటుందా? ఒకవేళ వదులుకోవాల్సి వస్తే.. బుచ్చయ్యను సముదాయించడం జరిగేపనేనా? అన్నదే జవాబులేని ప్రశ్న. ఒకవేళ టీడీపీకే టిక్కట్ ఖరారనుకుంటే… ఇక్కడ బలంగా ఉన్నామనుకుంటున్న జనసేన నేతలు కామ్‌గా ఉంటారా? కందుల దుర్గేశ్ వంటి బలమైన నాయకుణ్ని పవన్ కల్యాణ్ వదులుకుంటారా? అన్నదీ అనుమానమే. 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజమండ్రి ఎంపీ స్థానానికి పోటీచేసి ఓడినా.. ఆ తర్వాత జనసేనలో చేరి.. బలమైన క్యాడర్‌ను సమకూర్చుకున్నారు దుర్గేశ్. దీంతో, ఈ పొత్తుల పంచాయితీ తేలితే గానీ.. ఇక్కడ విపక్షాల పోటీపై ఓ క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. అయితే, అటు టీడీపీ, ఇటు జనసేన.. ఈ రెండు పార్టీలూ కలిసి.. అధికారపార్టీని బెదరగొడుతున్నాయనే ముచ్చట మాత్రం బలంగానే వినిపిస్తోంది.
ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు వైసీపీ
ఇక, అధికార పార్టీ వైసీపీ పరిస్థితి… ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. గత ఎన్నికల్లో బుచ్చయ్యచౌదరిపై పోటీచేసి ఓడిన ఆకుల వీర్రాజును పక్కన పెట్టింది వైసీపీ. తండ్రి చందన రమేశ్ తర్వాత వారసత్వంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చందన నాగేశ్వర్.. ఈసారి వైసీపీ నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసినా వైసీపీ జెండా ఎగరలేదిక్కడ. అయితే, ఇప్పుడు ఫ్యాన్‌గాలి బాగా వీస్తున్న దరిమిలా… చందన నాగేశ్వర్ జోరు పెంచారు. గడపగడపకి మన ప్రభుత్వం అంటూ.. ప్రజల్లోకి వెళుతున్నారు. ఈసారి కచ్చితంగా రాజమండ్రి రూరల్‌లో జెండా పాతుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గ్రూపు తగాదాలు, నాయకత్వ లేమి..
అయితే, నాగేశ్వర్‌కు విజయం అంత వీజీ కాదంటున్నాయి లోకల్ పొలిటికల్ సమీక్షలు. ఇక్కడి రాజమండ్రి రూరల్, కడియం మండలాల్లో.. దేనికదే ప్రత్యేకం. రాజమండ్రి రూరల్‌లో టీడీపీ నేత బుచ్చయ్యకు తిరుగులేని పట్టుంది. చందన్ నాగేశ్వర్ కొత్తనాయకుడు. దీంతో, ఆయన గెలుపు ఆశలు అంతంత మాత్రమేనన్నది విశ్లేషకుల మాట. ఒకరకంగా చెప్పాలంటే… 2024కి రాజమండ్రి రూరల్‌లో వైసీపీకి సరైన అభ్యర్థే లేడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచినా… ఉభయగోదావరి జిల్లాల్లో కీలకమైన రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ స్థానాల్ని మాత్రం భారీ తేడాతో ఓడిపోయింది వైసీపీ. ఆ తర్వాతైనా పార్టీ పరిస్థితిలో మార్పొచ్చిందా అంటే.. అబ్బే… లేదనే చెప్పాలి. ఎంపీగా ఉన్న మార్గాని భరత్… అర్బన్ బాధ్యతలు చూస్తున్నా… రూరల్ పరిస్థితే ఎటూ కాకుండా ఉంది. సరైన నాయకుడు లేకపోవడం ఒకెత్తయితే… గ్రూపురాజకీయాల గూడుపుఠానీ… పార్టీని మరింత ఇబ్బంది పెడుతోంది. ఈ లెక్కన వచ్చేసారి సైతం… టీడీపీకి బంగారు పళ్లెంలో పెట్టి రూరల్ నియోజకవర్గాన్ని అప్పగించేస్తారేమోనన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది.
బీసీలే కింగ్‌మేకర్లు.. కాపుల హవా ఎక్కువే
రాజమండ్రి రూరల్‌లో బీసీలే పొలిటికల్‌గా కింగ్ మేకర్లు. వారితో పాటు కాపులూ తీవ్ర ప్రభావమే చూపిస్తుంటారు. రూరల్ మండలంలో.. ఈ కాంబినేషన్ ఎక్కువగా వర్కవుట్ అవుతోంది. ఇక… కమ్మ, కాపుల కలహం కూడా అద్భతహ అనిపిస్తుంది. కడియం మండలంలో చందన నాగేశ్వర్ సామాజికవర్గమైన… పద్మశాలీల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. గతంలో కడియం నియోజకవర్గంగా ఉన్న సమయంలో… ఇక్కడ కాపులకే ఆధిక్యం ఉండేది. ఆ తర్వాతే సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. బీసీలు మద్దతిచ్చిన వారిదే గెలుపన్నట్టుగా తయారైంది పరిస్థితి. టీడీపీకి ఇక్కడ అదే కలిసివస్తోందన్న ఈక్వెషన్స్ ఉన్నాయి. రెండు దఫాలుగా కమ్మవర్గానికి చెందిన బుచ్చయ్య గెలుపునకూ అదే కారణమైంది. అయితే, ఇక్కడ జనసేన తరపున కీలకంగా ఉన్న కందుల దుర్గేశ్ కాపువర్గానికి చెందిన నేత. కాబట్టి, వచ్చేసారి ఓట్లచీలికకు కారణమై.. మళ్లీ వైసీపీకి చెక్ పెట్టడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో … కడియం మండలంలో జనసేన సత్తాచాటింది. దీంతో, ఈసారి వార్ డిఫరెంట్‌గా ఉంటుందనేది మాత్రం స్పష్టమవుతోంది.
అభివృద్ధి ముచ్చట అంతంతేనా?
రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో… అభివృద్ధి ముచ్చట అంతంత మాత్రమే. ఎందుకంటే, ఇక్కడున్నది విపక్ష ఎమ్మెల్యే. కాబట్టి, అధికార పార్టీ సహకరించడం లేదన్నది.. లోకల్ తెలుగుతమ్ముళ్ల ఆరోపణ. అయితే, ఎలాంటి వివక్ష లేకుండా… ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నామంటున్నారు అధికారపక్షం నేతలు.
గంజాయి మాఫియా, బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోతుంటే పట్టదా?
రాజమండ్రి రూరల్ ఏరియాను ప్రధానంగా వేధిస్తున్న సమస్య శానిటైజేషన్ లేకపోవడం. ఇక, గంజాయి మాఫియా, బ్లేడు బ్యాచ్… పెట్రేగిపోవడం… లోకల్‌గా భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. స్థానిక ఎమ్మెల్యేగా బుచ్చయ్య చౌదరి… ఎప్పటికప్పుడు పోలీసులతో సమీక్షలు చేస్తున్నప్పటికీ… అధికార పార్టీ నాయకులు పట్టించుకోకపోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
రూరల్‌లో గెలుపుపై ఎవరి ధీమా వారిదేనా?
తండ్రి చందన రమేశ్ చరిష్మా… వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. తన విజయానికి దోహదం చేస్తాయనే ఆశతో ఉన్నారు అధికార పార్టీనేత చందన నాగేశ్వర్. అయితే, రూలింగ్ పార్టీలో రుసరుసలు.. మరోసారి తమకు పట్టం కడతాయనే ధీమాతో తెలుగు తమ్ముళ్లున్నారు. ఎవరి ఈక్వెషన్స్ ఎలా ఉన్నా… ఎవరి ధీమా ఏదైనా.. రూరల్‌ఓటర్ల మనసులో ఏముందన్నది మాత్రం ఎన్నికలొస్తే గానీ తెలియదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం
