
జూదం ఆడటం, మద్యపానం సేవించటం వంటి చెడు వవ్యసనాల బారినపడిన వారికి పోలీసులు తరచూ కౌన్సిలింగ్ ఇస్తుంటారు. ఇలాంటి అలవాట్లు మానేయాలని చెప్తుంటారు. కానీ వాళ్లు మాత్రం వాటిని పెడచెవిన పెట్టి మళ్లీ అదే అలవాట్లకు వెళ్తారు. ఈ నేపథ్యంలో పేకాట ఆడుతూ పట్టుబడిన వారి విషయంలో కోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. శ్రీకాకుళం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఐదుగురు వ్యక్తులకు జరిమానాతో పాటు సామాజిక సేవా కార్యక్రమం చేయాలని నిర్దేశించించింది. జూదం, మద్యపానం వలన వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితాలు దెబ్బతింటున్న నేపథ్యంలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఐదుగురు వ్యక్తులపై నమోదు చేసిన కేసుపై విచారణ జరిపిన శ్రీకాకుళం సెకండ్ క్లాస్ కోర్టు మెజిస్ట్రేట్ కె. శివరామకృష్ణ బుధవారం తీర్పు వెలువరించారు.
సామాజిక సేవలో భాగంగా పేకాటలో పట్టుబడిన ఐదుగురు వ్యక్తులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున జరిమానా తోపాటు పది రోజులు శ్రీకాకుళం పట్టణము నందు గల ముఖ్యమైన కూడలిలో, జూదం నిషేధము, బహిరంగ ప్రదేశంలో మద్యపానం నిషేధము, వంటి ప్లకార్డులు ఉదయం సాయంత్రం ప్రదర్శించాలని మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారు. కోర్టు తీర్పుననుసరించి గురువారం శ్రీకాకుళం పిఎస్అర్ కూడలి వద్ద శ్రీకాకుళం DSP వివేకానంద, వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో జూదం ఆడటం చట్ట రీత్యా నేరం,బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం నిషేదం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ఐదుగురు ముద్దాయిలు.
జూదం, మద్యపానం వంటివి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతాయిని,ప్రతి ఒక్కరూ జూదం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని,చట్టాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పైడిపు నాయుడు, టూ టౌన్ సీఐ ఈశ్వరరావు,ట్రాఫిక్ సిఐ నాగరాజు ,వన్ టౌన్ ఎస్సై హరికృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
బహిరంగ మద్యపానం కేసులో మందుబాబుకి 30రోజుల జైలు శిక్ష
శ్రీకాకుళంలోని మిల్లీ జంక్షన్ వద్ద బుధవారం సాయంత్రం బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ, వచ్చి పోయే ప్రజలకు ఇబ్బంది కలిగించిన కాగన గణేష్ (మండల వీధి నివాసి.)అనే వ్యక్తిని శ్రీకాకుళం వన్ టౌన్ పోలీసులు పట్టుకుని శ్రీకాకుళం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 294(B) IPC ప్రకారం ఓపెన్ డ్రింకింగ్ కేసు నమోదు చేశారు. నమోదైన కేసులో నిందితుడిని గురువారం శ్రీకాకుళం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్ కె. శివరామక్రిష్ణ 30 రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.