మనం రోజు ఎన్నో విషయాలు వింటాం.. చూస్తాం.. అందులో కొన్ని విషయాలు, వార్తలు ఆశ్చర్యంగా ఉంటాయి. కొన్ని భయంకరంగా ఉంటాయి. కొన్ని షాక్ అయ్యేలా చేస్తాయి. అలాంటి వార్త ఇప్పుడు ఒక్కటి జరిగింది. ఒక్క వ్యక్తి తప్పిపోయిన తర్వాత 20 ఏండ్ల తర్వాత దొరకాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పట్టణంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వీరిలో శ్రీహరి అనే వ్యక్తి ఇచ్చిన సమధానంలో పోలీసులు ఖంగుతిన్నారు. తాను దొంగ కాదని, 20 ఏళ్ళ క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి దేశదిమ్మరిగా తిరుగుతున్నట్టు తెలిపాడు. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో తన ఇంటి అడ్రస్ కూడా చెప్పాడు. శ్రీహరి ఇచ్చిన వివరాల ప్రకారం అతని కుటుంబసభ్యులను మార్కాపురం ఎస్సై సైదుబాబు పిలిపించారు. 20 ఏళ్ల క్రితం తప్పిపోయి పోలీసుల అదుపులో మాసిన గడ్డంతో ఉన్న శ్రీహరిని తమ కుమారుడేనని అతని తల్లి గుర్తుపట్టి అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఎన్నో ఏళ్లుగా తప్పిపోయిన తమ కుమారుడి ఆచూకీ గురించి చెప్పిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామానికి చెందిన సుందరశెట్టి కోటేశ్వరరావు, శేషమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. రైతు కుటుంబం కావడంతో అందరూ కలిసి వ్యవసాయం చేసుకునేవారు. వీరిలో చివరి కొడుకు శ్రీహరి. శ్రీహరి 20 ఏళ్ళ క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. అప్పుడు అతని వయస్సు 15 సంవత్సరాలు.. శ్రీహరి ఎందుకు ఇంటినుంచి వెళ్ళిపోయాడో కుటుంబసభ్యులకు అర్ధం కాలేదు. ఇంటి నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూలీ పనులు చేసుకుంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తిరిగాడు. ఎక్కడ పనిదొరికితే అక్కడ పని చేసుకుంటూ కడుపు నింపుకునేవాడు. చివరిగా తిరుపతిలో ఉంటున్న శ్రీహరి తన స్నేహితుడితో కలిసి మద్యం సేవించి ఆ మత్తులో తిరుపతి నుంచి గుంటూరు వెళ్ళే రైలు ఎక్కాడు. మత్తు దిగిన తరువాత చూసుకుంటే రైలు మార్కాపురం రైల్వే స్టేషన్‌లో ఆగి ఉంది. వెంటనే మార్కాపురంలో రైలు దిగిన శ్రీహరి తన స్నేహితుడితో కలిసి తిరిగి మద్యం సేవించేందుకు వీధుల్లో తిరిగారు. పలకల ఎస్టేట్ దగ్గర ఉన్న మద్యం దుకాణంలో ఫుల్లుగా మద్యం తాగారు. మద్యం మత్తులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ ఇద్దర్నీ గమనించిన స్థానికులు దొంగలుగా భావించారు.
ఇటీవల కాలంలో మార్కాపురంలో ఎక్కువగా దొంగతనాలు జరుగుతుండటంతో స్థానికంగా కొత్తవారిగా కనిపిస్తున్న ఈ ఇద్దరి గురించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వీరిద్దర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు మార్కాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిని విచారించే క్రమంలో శ్రీహరి 20 ఏళ్ళ క్రితం ఇంట్లోనుంచి పారిపోయాడని తెలుసుకున్న ఎస్‌ఐ సైదుబాబు వెంటనే ఆ కుటుంబసభ్యులకు అతన్ని అప్పగించారు.