AP News: ఈ పార్టీలో జోరందుకున్న అసమ్మతి రాగం.. తెరపైకి సరికొత్త రాజకీయం..

విజయనగరం జిల్లాలో కాస్ట్ పాలిటిక్స్ తెర పైకి వచ్చాయి. కొప్పుల, వెలమ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లాలో ఫ్లెక్సీలు వెలిశాయి. కొప్పుల వెలమ నువ్వెక్కడ? కొప్పుల వెలమ మేలుకో? ప్రాధాన్యం ఇచ్చే పార్టీలకే మన మద్దతు అనే స్లోగన్స్‎తో ఈ ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు. కొప్పుల వెలమ సంక్షేమ సంఘం పేరిట వీనిని ఏర్పాటు చేశారు. ఎన్నికల వేళ ఈ ఫ్లెక్స్ వ్యవహారం జిల్లా రాజకీయ పార్టీల్లో ఆగ్గిరాజేశాయి.

AP News: ఈ పార్టీలో జోరందుకున్న అసమ్మతి రాగం.. తెరపైకి సరికొత్త రాజకీయం..
Cast Politics

Edited By: Srikar T

Updated on: Mar 01, 2024 | 4:51 PM

విజయనగరం జిల్లాలో కాస్ట్ పాలిటిక్స్ తెర పైకి వచ్చాయి. కొప్పుల, వెలమ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లాలో ఫ్లెక్సీలు వెలిశాయి. కొప్పుల వెలమ నువ్వెక్కడ? కొప్పుల వెలమ మేలుకో? ప్రాధాన్యం ఇచ్చే పార్టీలకే మన మద్దతు అనే స్లోగన్స్‎తో ఈ ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు. కొప్పుల వెలమ సంక్షేమ సంఘం పేరిట వీనిని ఏర్పాటు చేశారు. ఎన్నికల వేళ ఈ ఫ్లెక్స్ వ్యవహారం జిల్లా రాజకీయ పార్టీల్లో ఆగ్గిరాజేశాయి. అయితే వాస్తవానికి ఎవరు ఈ ఫ్లెక్స్ ఏర్పాటు చేశారో తెలియక సతమతమవుతున్నారు ఆయా రాజకీయపార్టీల నాయకులు. అయితే ఇటీవల టికెట్లు ప్రకటించిన టిడిపి, జనసేన కూటమిలో కొప్పుల వెలమ సామాజిక వర్గంకు ప్రాధాన్యం లేకపోవడం వల్లే గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్స్‎లు ఏర్పాటుచేసినట్లు ఊహాగానాలు వినపడుతున్నాయి. బిసిలకు కేరాఫ్ అడ్రస్‎గా చెప్పుకునే టిడిపి విజయనగరం జిల్లాలో బిసిలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని ఇప్పటికే మండిపడుతున్నారు బీసీ సంఘాల నేతలు. బీసీ జిల్లాలో ఓసీలకు ప్రాధాన్యం ఇచ్చి తమను పక్కన పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోతే తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.

సహజంగా బీసీలకు కంచుకోట విజయనగరం జిల్లా. రాష్ట్రం మొత్తం మీద ఈ జిల్లాలో తూర్పు కాపు, కొప్పల వెలమ, యాదవ సామాజికవర్గాలకు చెందిన ప్రజలు అధికంగా ఉంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇక్కడ నుండి ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారికే ప్రాధాన్యత ఇస్తాయి. ఇక్కడ రాజకీయ పార్టీల గెలుపోటములు సైతం ఈ రెండు సామాజిక వర్గాల ఓటర్లే శాసిస్తారు. అయితే ప్రస్తుతం ప్రతిపక్ష టిడిపి, జనసేన కూటమి నాలుగు రోజుల క్రితం తమ అభ్యర్థులను ప్రకటించింది. అందులో భాగంగా విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ఎనౌన్స్ చేసింది. అలా ప్రకటించిన అభ్యర్థుల పేర్లు విని జిల్లాలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన తూర్పుకాపు, కొప్పల వెలమ సామాజికవర్గాల నేతలు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం పార్లమెంట్ పరిధిలో విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, రాజాం, ఎచ్చెర్ల. ఈ ఏడు నియోజకవర్గాల్లో రాజాం ఎస్సీ రిజర్వుడ్ కాగా మిగతా ఆరు నియోజకవర్గాల్లో తూర్పుకాపు, వెలమ సామాజిక వర్గాల వారే అధికంగా ఉంటారు.

ఓటర్ల ప్రతిపాదికన తూర్పు కాపు లేదా కొప్పల వెలమ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇక్కడ టికెట్లు కేటాయించడం తప్పనిసరి. అయితే ఆరు నియోజకవర్గాల్లో ఇప్పటికే బొబ్బిలిలో బేబీనాయన, విజయనగరం అదితి గజపతిరాజు కాగా పొత్తులో భాగంగా నెల్లిమర్ల లోకం నాగమాధవి కేటాయించారు. ఈ ముగ్గురు కూడా ఓసి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే. మరో మూడు నియోజకవర్గాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. వీటిలో చీపురుపల్లి నియోజకవర్గం కూడా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా రెండు నియోజకవర్గాల్లో గజపతినగరం తూర్పు కాపులకు కేటాయించగా, మరొక నియోజకవర్గమైన ఎచ్చెర్లలో అభ్యర్థి ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితిలో విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఒకటి లేదా రెండు సీట్ల వరకు తూర్పు కాపులకు కేటాయించగా, జిల్లాలో రెండో అతిపెద్ద ఓటు బ్యాంక్ ఉన్న కొప్పలవెలమ సామాజిక వర్గానికి మాత్రం పూర్తిగా మొండి చెయ్యి చూపించిందనే టాక్ బలంగా వినిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ పరిస్థితిలో కొప్పల వెలమ సామాజికవర్గ సంక్షేమ సంఘం పేరిట జిల్లాలో పలుచోట్ల ఏర్పాటుచేసిన ఫ్లెక్స్‎లు హాట్ టాపిక్‎గా మారాయి. తమకు అన్యాయం చేసే ఏ రాజకీయ పార్టీలకైనా కొప్పల వెలమ సామాజిక వర్గం వారు ఓటు వేయొద్దని చెప్తూ ఫ్లెక్స్ ఏర్పాటుచేశారు. ఇలా ఎన్నికల వేళ కుల సంఘాల పేరిట అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏర్పాటు అయిన ఫ్లెక్స్‎తో పై టిడిపి ఎలా న్యాయం చేస్తుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..