
అది జనవరి 18, 2007. ఆంధ్ర- తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఆరాధ్య దైవమైన సింగోటం లక్ష్మీనరసింహస్వామి రథోత్సవాన్ని చూసేందుకు 70 మంది బోటులో ప్రయాణం చేసి వెళ్లారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన 61 మంది నీళ్లలో మునిగి మృత్యువాత పడ్డారు. మరో 10 మంది వరకు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. బహుశా తెలుగు రాష్ట్రాలలో ఇంత పెద్ద సంఘటన ఇప్పటికీ అందరికీ మెదులుతూనే ఉంటుంది. అందుకే దీనిని మహా విషాదంగా, మహాప్రళయంగా భావిస్తుంటారు.
సింగోటం జాతరకు వెళ్లాలంటే కృష్ణా నదిలో తెప్పలు, బోట్లు అరిగీ లపై ప్రయాణించాల్సిందే. రెండు రాష్ట్రాలను అనుసంధానించే ఈ కృష్ణనదిపై బ్రిడ్జిని నిర్మించాలని ఏళ్ల నాటిగా డిమాండ్ ఉంది. అయితే ఇప్పటివరకు ఆ కల నెరవేరలేదు. సరిగ్గా నేటితో ఆ మహా విషదానికి 19 ఏళ్ళు నిండింది. కొల్లాపూర్ లోని బొంగురోళ్ల మిట్ట వద్ద వంతెన నిర్మాణానికి 2009 ఫిబ్రవరి 13న పైలాన్ ఆవిష్కరించారు. వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి టెండర్లు పిలిచింది.హైదరాబాద్ కల్వకుర్తి నాగర్ కర్నూల్ కొల్లాపూర్ వరకు జాతీయ రహదారి 167 కే పనులు కొనసాగుతున్నాయి. సోమశిల సమీపంలోని గుట్టల వద్ద భూకేటాయింపు కూడా పూర్తయింది. వచ్చే ఏడాది నాటికైనా కృష్ణానది పై వంతెన పూర్తవుతుందని ప్రజలు భావిస్తున్నారు.
సోమశిల సిద్దేశ్వరం వంతెన పూర్తి అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు పెరగడమే కాకుండా దూర భారం తగ్గుతుంది. తెలంగాణలోని కొల్లాపూర్, ఏపీ లో నందికొట్కూరు నంద్యాల, కర్నూలు తదితర ప్రాంతాల్లోని బంధువుల వద్దకు వెళ్లి రావాలంటే బోట్లు, పుట్టిలు ఆధారం. ప్రస్తుతం మర బోటు ప్రయాణాన్ని అధికారులు నిలుపుదలచేశారు. దీంతో రెండువైపులా వెళ్లాలంటే 60 కిలోమీటర్ల పైగా అదనపు ప్రయాణం చేయాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా వంతెన పూర్తి చేయాలని రెండు రాష్ట్రాల బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..