తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. రాబోయే రెండుమూడు రోజుల్లో

తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా కంటిన్యూ అవుతోంది. తెలంగాణలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోతున్నాయి. ఉత్తర భారత దేశం నుంచి వీస్తున్న చలిగాలులతో అతి శీతల వాతావరణం కొనసాగుతోంది. రాబోయే రెండుమూడు రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. రాబోయే రెండుమూడు రోజుల్లో
Winter Chill

Updated on: Jan 01, 2026 | 10:15 PM

తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. ఉదయం పూట రహదారులపై విజిబిలిటీ తగ్గిపోతోంది. ఇక తెలంగాణను చలి పులి వణికిస్తోంది. హైదరాబాద్ నగరాన్ని పొగ మంచు కమ్మేసింది.. దట్టమైన పొగ మంచు కారణంగా రోడ్లమీద విజిబిలిటీ తగ్గిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న రెండుమూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఇక పటాన్‌చెరులో 8.2, మెదక్‌లో 9.3, రాజేంద్రనగర్ 11, హైదరాబాద్ 13.8, రామగుండంలో 11.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాకర్లు…స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లతో పార్కుల్లో మార్నింగ్‌ వాక్‌లు చేస్తున్నారు. చలి, పొగమంచు కారణంగా….రోజువారీ పనుల కోసమే ఉదయం బయటికి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో చిన్న పిల్లలు, వృద్దులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో ఉదయం పూట పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. దీంతో రహదారులపై కనుచూపు మేరలో కూడా వాహనాలు కనిపించడం లేదు. ఈ పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నల్గొండ జిల్లా చిట్యాల, చౌటుప్పల్ మధ్యలో దట్టమైన పొగ మంచు అలుముకుంటోంది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా పొగ మంచు కురుస్తోంది. హైవేపై హెవీ ఫాగ్‌ ఉండడంతో….వాహనదారులు హెడ్ లైట్లు వేసుకొని జాగ్రత్తగా వెళ్తున్నారు. ఉదయం ఎనిమిది గంటలు దాటినా పొగమంచు ప్రభావం తగ్గడం లేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల వేగం తగ్గించుకుని మెల్లగా వెళుతున్నారు.

మినుములూరులో 8 డిగ్రీలు

ఏపీలో మన్యం ప్రాంతాలను చలి గజగజా వణికిస్తోంది. వాతావరణంలో మార్పులతో పాటు ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో చలి చంపేస్తోంది. ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. పాడేరు జిల్లా కేంద్రంలో… తెల్లవారుజాము నుంచి ఉదయం పదిన్నర గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. దీంతో ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వచ్చింది. పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మినుములూరు 8, పాడేరు 10, అరకు 11, చింతపల్లిలో 15.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండుమూడు రోజుల్లో చలి తీవ్రత పెరుగుతుందని IMD పేర్కొనడంతో జనం బెంబెలెత్తుతున్నారు.