AP News: పేరెంట్స్‌ను నిర్లక్ష్యం చేసే బిడ్డలకు వార్నింగ్‌.. జైలు శిక్ష తప్పదు సుమా..

| Edited By: Narender Vaitla

Nov 04, 2023 | 2:22 PM

ఆ సమస్త ఏంటంటే తమ పిల్లలు తమను సరిగా చూడడం లేదని, మానసికంగా వేధిస్తున్నారని, తమ ఆస్తుల కోసం కొన్ని సందర్భాలలో శారీరకంగా వేధిస్తున్నారన్న ఫిర్యాదులు ఎక్కువై పోతున్నాయట. అంతే కాదు తమ దగ్గర ఉన్న ఆస్తులు రాయించుకునేంత వరకు బాగానే ఉండి, ఆ తర్వాత తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని, తమను సరిగా పట్టించుకోవడం లేదనీ, అసలు మనుషుల్లానే చూడడం లేదంటూ వాపోతున్నారు...

AP News: పేరెంట్స్‌ను నిర్లక్ష్యం చేసే బిడ్డలకు వార్నింగ్‌.. జైలు శిక్ష తప్పదు సుమా..
Representative Image
Follow us on

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో శాంతి భద్రతలను కాపాడడం నిరంతరం ఒక సవాల్ లాంటిది. అలాంటి నగరాలలో శాంతి భద్రతలను పర్యవేక్షించే అధికారులకు ఇటీవల కాలంలో ఒక వింత సమస్య ఎదురవుతోంది. అత్యంత అమానవీయమైన ఈ సమస్య ప్రస్తుతం పోలీస్ అధికారులను సైతం వేధిస్తోందట.

ఆ సమస్త ఏంటంటే తమ పిల్లలు తమను సరిగా చూడడం లేదని, మానసికంగా వేధిస్తున్నారని, తమ ఆస్తుల కోసం కొన్ని సందర్భాలలో శారీరకంగా వేధిస్తున్నారన్న ఫిర్యాదులు ఎక్కువై పోతున్నాయట. అంతే కాదు తమ దగ్గర ఉన్న ఆస్తులు రాయించుకునేంత వరకు బాగానే ఉండి, ఆ తర్వాత తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని, తమను సరిగా పట్టించుకోవడం లేదనీ, అసలు మనుషుల్లానే చూడడం లేదంటూ వాపోతున్నారు. దీంతో చకించిపోతున్న పోలీస్ అధికారులు తల్లి తండ్రులపట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్న కుమారుల కు బుద్ది తెప్పించేలా అందుబాటులో ఉన్న చట్టాల దుమ్ము దులిపి ఆ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కింది స్థాయి ఉద్యోగులను ఆదేసిస్తున్నారట.

RDO అధ్యక్షతన ట్రిబ్యునల్..

తల్లితండ్రులు, వృద్ధులు, వయో వృద్ధులను వారి కుటుంబాలు, పిల్లలు చూసుకోకపోవడం, వారిని మానసికంగా నిర్లక్ష్యం చేయడం, శారీరక, ఆర్థిక మద్దతు ఇవ్వక పోవడం లాంటి ఘటనలు చోటు చేసుకోకుండా గతంలోనే చట్టాలు తయారయ్యాయి. “తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007 కింద తల్లితండ్రుల, వృద్ధుల సంరక్షణ, రక్షణపై ఆయా కుటుంబ సభ్యులు బాధ్యత వహించాల్సి ఉంది. తల్లిదండ్రులతో సహా ఎవరైనా సీనియర్ సిటిజన్ తన స్వంత సంపాదన నుంచి లేదా అతని స్వంత ఆస్తి నుంచి తనను తాను కాపాడుకోలేక పోయినప్పుడు పోలీసులకు కార్యక్రమంలో ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదును సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపిస్తార. ఆరోపణలపై ప్రాథమిక ధృవీకరణ చేయడానికి, అవసరమైన చర్య తీసుకోవాలని అభ్యర్థనతో RDO అధ్యక్షతన ఉన్న ట్రిబ్యునల్ ఒక నివేదికను పంపడం, ట్రిబ్యునల్‌ను ఆశ్రయించేలా ఫిర్యాదుదారుని మార్గనిర్దేశం చేస్తారు.

మూడు నెలలు జైలు శిక్ష..

సీనియర్ సిటిజన్ సంరక్షణ లేదా రక్షణను కలిగి ఉన్న ఎవరైనా సీనియర్ సిటిజన్ ను పూర్తిగా విడిచిపెట్టాలనే ఉద్దేశ్యంతో ఏ ప్రదేశంలోనైనా వదిలిపెట్టినట్లయితే.. తల్లిందడ్రులు, సీనిరయర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమం చట్టం 2007 ప్రకారం మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 5 వేల జరిమానా విధిస్తారు. ఇలాంటి సందర్భాల్లో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి, u/s 173 crpc పై నివేదికను కోర్టుకు దాఖలు చేస్తారు.

విశాఖలో ఎక్కువ ఫిర్యాదులు..

ఈ తరహా ఫిర్యాదులు ఇటీవల కాలంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఎక్కువగా ఉన్నాయట. ఇటీవల నగరంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ రవి శంకర్ అయ్యన్నార్ కి స్పందన కార్యక్రమంలో ఎక్కువగా వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణను వారి పిల్లలు సరిగ్గా చూసుకోకపోవడం పై ఫిర్యాదులు ఎక్కువగా పునరావృతం అయ్యాయట. దీంతో సున్నితమైన ఈ ఫిర్యాదుల పట్ల పోలీస్ కమిషనర్ చాలా అవేదన చెందారట. కనిపించిన తల్లితండ్రులను దైవంతో సమానంగా చూడాల్సిన కుమారులు ఇంత అమానవీయంగా ఎలా ప్రవర్తిస్తున్నారో కానీ నేనున్నానంటూ తల్లితండ్రులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ తరహా కేసులను నగర పోలీసు కమీషనర్ డాక్టర్ ఏ. రవి శంకర్ స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించారు.

వృద్ధాప్యం అనేది ఎవరి జీవితంలోనైనా అత్యంత సున్నితమైన దశ అని ఆ సమయంలో వారి చుట్టూ ఉన్న ప్రతిదీ చాలా సున్నితంగా మారుతుంది కాబట్టి వారు ఇష్టం లేకపోయినా జీవించడానికి ఇతర వ్యక్తులపై మరింత ఎక్కువగా ఆధారపడుతుంటారు. అలాంటి.. వృద్ధ తల్లిదండ్రులు మీ నుంచి సంరక్షణను కోరుకునే సమయం వచ్చినప్పుడు, మంచి ఆరోగ్యాన్ని, ఉన్నత జీవన ప్రమాణాలను, వారికి అవసరమైన గౌరవం, ప్రేమను అందించడానికి కట్టుబడి ఉండాలంటూ విశాఖ నగర పోలీస్ కమిషనర్ అలాంటి సంతానాలకు అప్పీల్ చేస్తున్నారు. మీరు మీ తల్లిదండ్రులు పట్ల చూపే ప్రేమ, అనురాగాలే, భవిష్యత్తు మీ పిల్లల నుంచి మీకు వస్తాయన్న విషయాన్ని మరవద్దని పోలీస్‌ కమిషనర్‌ సూచించారు.

గడచిన రెండేళ్లలో 7 కేసులు నమోదు..

విశాఖ నగరంలో గడిచిన రెండేళ్లలో వృద్ద తల్లిదండ్రులతో అనుచితంగా ప్రవర్తించిన వారిపై 7 కేసులు నమోదయ్యాయి. వారి పై తగు చట్ట పరమైన చర్యలు కూడా తీసుకున్నట్టు పోలీస్ కమిషనర్ కార్యాలయం తెలిపింది. వృద్ధ తల్లిదండ్రులను వారి కుటంబసభ్యులు నిర్లక్ష్యం చేసినా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టినా చట్టప్రకారం తగు చర్యలు తీసుకుంటారని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ఇబ్బందులకు గురైతే సీపీ వాట్సప్ నంబర్ 9493336633కు, లేదా పోలీసు హెల్ప్ లైన్ 112 లేదా నేషనల్ సీనియర్ సిటిజన్స్ హెల్ప్ లైన్ నంబర్ 14567 కు తెలియజేయాలని సీపీ కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..