పైకి చీరల వ్యాపారం అనుకునేరు.. కట్ చేస్తే.. లోపల యవ్వారానికి మైండ్ బ్లాంకే.!
అనంతపురం నడిబొడ్డున గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్న లింగ నిర్ధారణ పరీక్షలు వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రామచంద్ర నగర్‌లోని ఓ ఇంట్లో చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో జిల్లా వైద్యాధికారులు, పోలీసులు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఇంటిపై దాడులు నిర్వహించారు.
అనంతపురం నడిబొడ్డున గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్న లింగ నిర్ధారణ పరీక్షలు వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రామచంద్ర నగర్‌లోని ఓ ఇంట్లో చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో జిల్లా వైద్యాధికారులు, పోలీసులు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఇంటిపై దాడులు నిర్వహించారు. లోపల ఏం జరుగుతుందో తెలుసుకున్న వైద్యశాఖ అధికారులు, పోలీసులు దెబ్బకు కంగుతిన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నాలుగు నెలల క్రితం రామచంద్ర నగర్‌లో ఓ ఇంటిని అద్దెకి తీసుకున్న శ్రావణి, సునీల్. స్కానింగ్ మిషన్ పెట్టుకుని గర్భిణీ స్త్రీలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇల్లు అద్దెకి తీసుకునేటప్పుడు ఓనర్‌తో చీరల వ్యాపారం చేస్తామని చెప్పారు. కట్ చేస్తే.. చివరికి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఒక్కొక్క గర్భిణీ స్త్రీ నుంచి లింగ నిర్ధారణ పరీక్షలకు దాదాపు రూ. 10 వేలు వసూలు చేస్తున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు.
శ్రావణి ఫార్మసీ చేయడం.. అదేవిధంగా సునీల్ గతంలో స్కానింగ్ సెంటర్‌లో పని చేసిన అనుభవంతో ఇద్దరు కలిసి ఇల్లీగల్‌గా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. అయితే లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత ఆడపిల్ల పుట్టబోయే గర్భిణీ స్త్రీలను అబార్షన్ కోసం ఎక్కడికి పంపిస్తున్నారు అన్నది ఇంకా తేలాల్సి ఉంది.
చీరల వ్యాపారం చేస్తున్నారని చెప్పడంతో తరచూ ఇంటికి మహిళలు వచ్చిపోతుండడంతో ఇంటి ఓనర్‌కు ఎక్కడా అనుమానం కూడా కలగలేదు. ఎలాంటి అనుమతులు లేకుండా స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం.. అదే విధంగా ఇల్లీగల్‌గా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న శ్రావణి, సునీల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన మహిళలు అబార్షన్ల కోసం ఎక్కడికి వెళ్తున్నారు అనే దాని మీద ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పైకి చీరల వ్యాపారం.. చేసేది పాడు పని అంటూ స్థానికులు వారిపై మండిపడుతున్నారు.