ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న నియోజకవర్గం పుట్టపర్తి.. సత్యసాయి కొలువుదీరిన ఈ ప్రాంతంలో నిత్యం ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఇటీవల పుట్టపర్తి(Puttaparthi)కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటైంది. ఇక్కడ డివోషన్ కు పాలిటిక్స్ కు ఎలాంటి సంబంధం లేకపోయినా.. గతంలో మాజీ మంత్రి పల్లె వర్రెస్ స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి(Duddukunta Sreedhar Reddy) మధ్య జరిగిన వార్ ఒక రేంజ్ లో మాటల యుద్ధానికి దారి తీసింది. ఇటీవల అది కాస్త శాంతించినా.. మాజీ మంత్రి పల్లె సొంత పార్టీలోని కొందరు నేతల అసమ్మతిని ఎదుర్కొంటూనే ఉన్నారు.. ఇప్పుడు సేమ్ టూ సేమ్ అలాంటి సీన్ ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా చూడాల్సి వస్తోంది. వాస్తవంగా శ్రీధర్ రెడ్డిది ఇక్కడ సింగల్ లీడర్ షిప్. పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ఒకే గొడుగు కింద ఉంటారు. అంతా శ్రీధర్ రెడ్డి చూపిన బాటలోనే నడుస్తుంటారు. కానీ ఇప్పుడు కొందరు నేతలు సైడ్ ట్రాక్ తీసుకున్నారు ఎందుకు..
ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. జిల్లా కేంద్రమైన పుట్టపర్తి వైసీపీలో పుట్టిన ముసలం పెద్ద చర్చగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని కాదని.. సైడ్ ట్రాక్ తీసుకున్న నేతలు ఎవరు.. ఇది వారంతట వారు తీసుకున్న నిర్ణయమా.. లేక వెనుక ఎవరైనా ఉన్నారా అంటే.. అప్పుడే ఒక కొత్తదనంతో కూడుకున్న పాత పేరు తెరపైకి వచ్చింది. ఆ పేరు పాముదుర్తి ఇంద్రజిత్ రెడ్డి. లోకల్ గా ఈ పేరు బాగా ఫేమస్. కానీ ఈ పేరును నియోజకవర్గమంతా విస్తరింపజేయాలని చూస్తున్నారు. ఇంతకీ ఎవరీ ఇంద్రజిత్ రెడ్డి అంటే.. మాజీ ఎమ్మెల్యే పాముదుర్తి రవీంద్రారెడ్డి కుమారుడే ఇంద్రజిత్. రవీంద్రారెడ్డి గురించి పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గోరంట్ల నియోజకవర్గంగా ఉన్న సమయంలో బాగా ఫేమస్.. పవర్ లీడర్ గా క్యాడర్ ను బాగా మెయిన్ టెయిన్ చేశారు. కానీ ఆయన మరణం తరువాత ఇంద్రజిత్ తన తండ్రి స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు..
ఇంద్రజిత్ ఎంపీటీసీగా గెలిచారు.. ఆ తరువాత ఎంపీపీగా నిలబడాలనుకుంటే.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి బ్రేక్ వేశారని టాక్. తనకు భవిష్యత్ లో ఎక్కడ పోటీ వస్తారోనన్న ఆందోళనతోనే ఆయన ఎదుగుదలను అడ్డుకున్నారనే విమర్శలు ఉన్నాయి. కానీ ఆ ఆందోళన ఇప్పుడు నిజమయ్యేలా ఉంది. శ్రీధర్ రెడ్డి సింగల్ లీడర్ షిప్ కు బ్రేక్ వేసేలా ఇంద్రజిత్ తొలిసారి వేసిన అడుగు నియోజకవర్గంలో అలజడి సృష్టించింది. నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వారిని, అలాగే తన తండ్రి వర్గంగా ఉన్న వారందర్నీ ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తచెరువు మండలంలో కీలకంగా ఉన్న నేతలతో గెట్ టూ గెదర్ నిర్వహించారు.
బుక్కపట్నం మండలంలోని స్వగ్రామం పాముదుర్తిలో ఇంద్రజిత్‌రెడ్డి తన తోటలోనే మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు హాజరయ్యారు. అంతే కాదు ఇక్కడ నేతలంతా ఎమ్మెల్యే మీద ఉన్న అసంతృప్తిని ప్రత్యక్షంగా.. పరోక్షంగా బయటపెట్టారు. పార్టీని నమ్ముకుని సర్వం త్యాగం చేసిన తమని కాదని పార్టీ జెండా పట్టని వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే తాము శ్రీధర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నామని.. మీరు పోటీలో ఉండాలంటూ ఇంద్రజిత్ రెడ్డిని బలపరుస్తున్నారు.
ఈ మీటింగ్‌తో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గ్రూప్ లో అలజడి మొదలైంది. దీనికి ఇంద్రజిత్ రెడ్డి కూడా సీఎం జగన్ ఓకే చెబితే నేను పోటీకి సిద్ధమని చెప్పడం ఇంకా హీట్ పెంచుతోంది. ప్రస్తుతానికి ఒక్క మండలంలోని నేతలతోనే మీటింగ్ జరిగింది. ఇక వరుసగా అన్ని మండలాల నేతలతో సమావేశం నిర్వహించి.. శ్రీధర్ రెడ్డికి ధీటుగా నిలబడే విధంగా తయారుకావాలని వ్యూహాలు పన్నుతున్నారు. మున్ముందు పుట్టపర్తి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండనుందో..
మరిన్ని ఏపీ న్యూస్ కోసం