Andhra Pradesh: పంచాయతీ ప్రజలకు ఇచ్చిన మాట కోసం.. నిధులు లేక సర్పంచ్ ఏం చేశారంటే..

Amarnadh Daneti

Amarnadh Daneti |

Updated on: Sep 17, 2022 | 10:05 AM

ఆంధ్రప్రదేశ్ లో చాలా పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. దీంతో పంచాయతీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు లేకపోవడంతో.. ఎప్పటికైనా డబ్బులు వస్తాయనే ఆశతో సర్పంచ్ లు..

Andhra Pradesh: పంచాయతీ ప్రజలకు ఇచ్చిన మాట కోసం.. నిధులు లేక సర్పంచ్ ఏం చేశారంటే..
Sarpanch

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో చాలా పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. దీంతో పంచాయతీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు లేకపోవడంతో.. ఎప్పటికైనా డబ్బులు వస్తాయనే ఆశతో సర్పంచ్ లు అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నా.. నిధులు విడుదల కాకపోవడంతో చేసేదేమి లేక తమ గోడును ప్రభుత్వం పట్టించుకోవాలంటూ ఇటీవల చాలా మంది సర్పంచ్ లు తమ నిరసనను తెలియజేస్తున్నారు. అయితే వినూత్నంగా నిరసన తెలుపుతూ.. తమ బాధలను అర్థం చేసుకుని, తమ పంచాయతీకి నిధులివ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదే క్రమంలో నంద్యాల జిల్లా నంది కొట్కూరు లో ఓ గ్రామ సర్పంచ్ బిక్షాటన చేస్తూ.. మోటర్లు బాగు చేయించడానికి తన దగ్గర రూపాయి లేదు.. సాయం చేయండంటూ ఇంటింటికి తిరిగి బిక్షాటన చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. అప్పులు చేసి పంచాయతీలో అభివృద్ధి పనులు చేయించినా.. బిల్లులు రాకపోవడంతో వడ్డీలు పెరిగిపోతున్నాయంటూ నందికొట్కూరు మండలం వడ్డెమాను పంచాయతీ సర్పంచి రామచంద్రుడు తమ గ్రామంలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు.

ఇంటింటికి వెళ్లి గ్రామంలో చేసిన పనులకు సంబంధించి తనకు బిల్లులు మంజూరు కాలేదని.. తోచినంత సాయం చేయాలని జోలె పట్టుకుని భిక్షాటన చేశారు. మురుగు కాలువలు, తాగు నీటి పైప్‌ లైన్‌, ట్యాంకుల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ ఇతర అభివృద్ధి పనులకు రూ.12 లక్షలు అప్పు చేసి ఖర్చు చేసినట్లు తెలిపారు. తనకు జీవనాధారమైన ఎకరం పొలం అమ్మినా అప్పు తీర్చలేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సర్పంచ్ రామచంద్రుడు. ప్రస్తుతం పంచాయతీకి తాగునీరు సరఫరా చేసే మోటార్లు పాడయ్యాయని, వాటికి మరమ్మతులు చేయించేందుకు రూ.40 వేలు అవసరం అవుతాయని, తన వద్ద రూపాయి కూడా లేదని.. అయితే. పంచాయతీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల్లో భిక్షాటన చేస్తానని చెప్తున్నారు. అందరు సర్పంచ్ ల పరిస్థితి ఇలాగే ఉందని, తమ పరిస్థితిని గుర్తించి సీఏం స్పందించాలని, పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu