Rythu Bharosa Kendralu: ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ రంగంలో దళారీ వ్యవస్థను అరికట్టేందుకే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలు తీసుకువచ్చారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. అగ్రి ఫండ్స్ ప్రాజెక్టుల ప్రగతి, వ్యవసాయ మౌలిక సదుపాయాలపై సీఎం జగన్ ఇవాళ సమీక్షించారని చెప్పిన మంత్రి.. ఈ సమావేశంలో రైతు భరోసా కేంద్రాల బలోపేతంపై పలు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.
రైతులను ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని మంత్రి కన్నబాబు తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌వద్ద సమీక్ష వివరాలను మంత్రి కన్నబాబు వెల్లడించారు. రైతులకు కావాల్సిన సహాయం అందించడం, శాశ్వత వనరులు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
ప్రణాళికలో భాగంగా రూ.16,343 కోట్లతో మల్టీ పర్ఫస్ ఫెసిలిటీ కేంద్రాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రతి గ్రామంలోని రైతులకు అవసరమైన గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు, కోల్డ్ రూములు, డ్రైన్ ప్లాట్‌ఫాంలు, అవసరమైన చోట బల్స్‌మీల్క్ సెంటర్లు, ఉద్యాన పంటలకు సంబంధించి కలెక్షన్ సెంటర్లు, ఆక్వాకు సంబంధించి మౌలిక వసతులు, అన్ని మార్కెట్ యార్డుల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయడం మల్టీ పర్ఫస్ సెంటర్లుగా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.