ఎవరైనా రాష్ట్ర స్థాయి నాయకులు, లేదా ముఖ్యమైన నేతలు వస్తేనో, లేదా కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు రోడ్లను భ్యారికేట్లతో మూసేస్తూ ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఒకచోట ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది… సినీ తార ఒక షాపు ఓపెనింగ్ కు వచ్చిందని ప్రజా రవాణాకు సంబంధించిన బస్టాండ్ ను ఆర్టీసీ అధికారులు బారికేట్లతో మూసేయడంతో ప్రయాణికులంతా మండిపడ్డారు. ఎవరో రావడం ఏమిటి మా ప్రయాణాలను ఆపుకోవడం ఏమిటి అంటూ ఆర్టీసీ అధికారుల తీరును దుమ్మెత్తి పోశారు.
కడప జిల్లా మైదుకూరు పట్టణంలో ఆర్టీసి బస్టాండ్ పక్కన ఓ బట్టల షాపు ప్రారంభోత్సవం సందర్భంగా మాజీ జబర్దస్త్ యాంకర్, సినీతార అనసూయ మైదుకూరుకు వచ్చింది. దీంతో ఆర్టీసీ అధికారులు బస్టాండ్ మెయిన్ ద్వారాన్ని మూసివేశారు. ఆ షాపు బస్టాండ్ కు పక్కనే ఉండడం అనసూయ వస్తుండడంతో అక్కడకు చాలామంది స్థానిక ప్రజలు చేరుకోవడం, వారంతా వారి వాహనాల పార్కింగ్ ను బస్టాండ్ లో పెట్టి అక్కడికి చేరుకోవడంతో బస్టాండ్ లోనికి రానివ్వకుండా బారికెట్లను పెట్టారు … అయితే దానివల్ల బస్సులు కూడా లోపలికి రావటం ఆగిపోయాయి. ఆర్టీసీ అధికారులు ఒకందుకు చేస్తే అది తీరా వారి మెడకే చుట్టుకుంది. ప్రయాణికులు, విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు లోనికి వచ్చిన బస్సులు బయటకి పోవడానికి లేకుండా.. బయట ఉన్న బస్సులు లోనికి రావడానికి లేకుండా బారికేట్లను ఏర్పాటు చేయడం వల్ల ఎక్కడి ప్రయాణికులు అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో ఆర్టీసీ అధికారుల తీరుపై ప్రయాణికులు మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా లేని వింత ఇక్కడ జరిగిందని ఎవరో సినీ తార వస్తే ఆర్టీసీ బస్సు ముఖ ద్వారాన్ని మూసేయడమేంటని ప్రయాణికులు అధికారుల తీరుపై మండిపడ్డారు.. ఈ విషయంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎవరికోసమో ప్రయాణికుల సౌకర్యార్థాలను నిలిపివేయడం మంచి పద్ధతి కాదని స్థానిక ప్రజలు మరియు ప్రయాణికులు అధికారుల తీరును తప్పు పట్టారు.
అది కూడా నిజమే కదా … ఒక షాపు కోసం, అది ప్రారంభానికి వచ్చిన సినీ తార కోసం.. వేల మంది ప్రయాణికులను అలా నడిరోడ్డుపై నిలిపివేయడం ఆర్టీసీ అధికారులకు ఎంతవరకు సమంజసమో వారికే తెలియాలి . ఇకనైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారిదే.