Central University in AP: ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం రూ.450 కోట్లు మంజూరు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, తలారి రంగయ్య అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dhamendra Pradhan) సోమవారం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 13వ షెడ్యూల్ ప్రకారం ఏపీలో సెంట్రల్ యూనివర్సిటీ (AP Central University) ఏర్పాటు చేసినట్లు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. యూనివర్సిటీకి భౌగోళిక హద్దులుగా యావత్ రాష్ట్రాన్ని నిర్ణయిస్తూ 2019 లో సెంట్రల్ యూనివర్సిటీస్ చట్టంలో సవరణలు చేశామని వివరించారు. అయితే.. ఈ సవరణ రాష్ట్రపతి ఆమోదంతో 2019 ఆగస్టు 5 నుంచి ఈ అమల్లోకి వచ్చినట్లు తెలిపారు.
2018-19 విద్యా సంవత్సరం నుంచే (Andhra Pradesh) యూనివర్సిటీ కార్యాకలాపాలు మొదలయ్యాయని తెలిపారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను అనుసరించి కొత్త క్యాంపస్ నిర్మాణం కోసం కేంద్రం రూ.450 కోట్లు మంజూరు చేసిందన్నారు. అవసరాన్ని బట్టి కేంద్రం నిధులు విడుదల చేస్తోందని వివరించారు. ఇప్పటి వరకు రూ.31.24 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు. మున్ముందు మరిన్ని నిధులు విడుదల చేస్తామని తెలిపారు.
Also Read: