చిత్తూరు జిల్లాలో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. ఏకంగా 40 లక్షల రూపాయల విలువచేసే బంగారం క్షణాల్లోనే మాయమవడం కలకలం రేపుతోంది. చిత్తూరులోని కీర్తన గోల్డ్ లోన్స్ కంపెనీలో చుట్టు పక్కల చాలా మంది గోల్డ్ తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు. ఆ బంగారాన్ని తీసుకుని బయలుదేరిన మేనేజర్ జాన్‌బాబు.. చిత్తూరు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఒక ప్రైవేట్ హోటల్ దగ్గర ఆగాడు. కారు పక్కకు ఆపి హోటల్ గదిలోకి వెళ్లాడు. ఇంతలోనే అక్కడికి వచ్చిన దుండగులు.. జాన్ బాబు కారులో ఉన్న బంగారంతో అక్కడ నుంచి ఉడాయించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటనలో మొత్తం 5 మంది పాల్గొన్నట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇది ఇంటి దొంగల పనేనా.. లేక బయట వ్యక్తుల ప్రమేయం ఉందా అన్న కోణంలో ప్రత్యేక టీమ్ దర్యాప్తు చేస్తోంది. బ్రాంచ్‌లో ఉండాల్సిన బంగారాన్ని మేనేజర్ ఎందుకు తీసుకెళ్లినట్టు.. ఆ హోటల్‌లోకి ఎందుకెళ్లినట్టు అనేవి ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న డౌట్స్. ఆ కారులో బంగారం ఉన్నట్టు దొంగలకు ఎలా తెలిసిందనేది బిగ్ క్వశ్చన్. చోరీ జరిగిన తీరు చూస్తుంటే ఇంటి దొంగల పనే అనే అనుమానం వస్తోంది. దీంతో ఆ కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు చుట్టుపక్కల గతంలో దొంగతనాలకు పాల్పడిన ముఠాలపై దృష్టి సారించారు అధికారులు. అనుమానితులను విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తుని వేగవంతం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..