
కన్ను మూసి తెరిచేలోగా దొంగలు తమ పని చక్కబెట్టుకుంటున్నారు. ముఖ్యంగా బ్యాంకుల వద్ద కస్టమర్స్ మాదిరిగా ఉండటం.. ఎవరు ఎక్కువ మొత్తం విత్ డ్రా చేస్తున్నారనేది చూడటం.. ఎలా తీసుకువెళుతున్నారో గమనిస్తూ సంబంధిత నగదు యజమాని ఏమరపాటుగా ఉన్న టైంలో తమ పని చక్కబెట్టుకుంటున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బ్యాంకు నుంచి డ్రా చేసి బైక్ ట్యాంక్ కవర్‌లో ఉంచిన రెండు లక్షలు నగదును మాయం చేశాడు ఒక కేటుగాడు.
నరసాపురం మండలం వేములదీవి గ్రామానికి ఉంగరాల శ్రీను పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో రెండు లక్షలు నగదును విత్‌డ్రా చేసి తన బుల్లెట్ వాహనం ట్యాంక్‌పై ఉన్న కవర్‌లో ఉంచి ఇంటికి వెళుతూ పంజా సెంటర్‌లోని హోటల్ వద్ద ఆగి టిఫిన్ చేసాడు. తిరిగి వచ్చేసరికి కవర్‌లో నగదు మాయం అయ్యింది. శ్రీనును బ్యాంక్ నుంచి వెంబడించిన దొంగలు హోటల్ వద్ద ఆగి బైక్ కవర్‌లో ఉన్న రెండు లక్షలు నగదును మాయం చేశారు. దీంతో లబోదిబోమంటూ హోటల్ సీసీ ఫుటేజ్‌ను పరిశీలించగా టోపీ పెట్టుకున్న వ్యక్తి బైక్‌లో ఉన్న నగదు కొట్టేసినట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇది ఒక ఘటన మాత్రమే డైవెర్షన్ చేసి వస్తువులు దొంగలించటం, చైన్ స్నాచింగ్స్ ఇలా ఒక్కో నేరస్తుడు ఒక్కో విధంగా చోరీలకు పాల్పడుతున్నారు. అయితే అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.