Konaseema: పండుగ వేళ.. జాలరికి కలిసొచ్చిన లక్.. చిక్కిన అరుదైన చేపతో సిరులు
సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల వలకు అప్పుడప్పుడు అరుదైన చేపలు చిక్కుతుంటాయి. అలాంటి చేపలు పడినప్పుడు వారి పంట పండుతుంది. తాజాగా అలాంటి ఘటనే జరిగింది.

సముద్రంపై ఆధారపడి జీవిస్తుంటారు మత్స్యకారులు. రోజుల తరబడి సముద్రంలో వేటసాగించినా, వారికి అరకొర ఆదాయమే వస్తుంటుంది. కానీ ఒక్కోసారి వారి వలకు అదృష్టం కూడా చిక్కుతుంటుంది. సాధారణ చేపల కోసం విసిరే వలకు, కాసుల కురిపించే మత్స్యాలు దొరుకుతుంటాయి. అలానే ఓ జాలరి లక్ తిరిగింది.. సుడి కలిసింది.. ఒక్క చేపతో మంచి ఆదాయం సమకూరింది. నెలంతా కష్టపడితే వచ్చే సొమ్ము ఒక్క రోజులోనే వచ్చింది. గంగమ్మకు బాగా మొక్కి.. వల వేసినట్టున్నాడు ఆ జాలరి. అందుకే అమ్మ కరుణించి.. సిరులు కురిపించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం పల్లెపాలెంకు చెందిన మత్స్యకారుడు అంతర్వేది సముద్రంలో వేటకు వెళ్లాడు. అతని వలలో అత్యంత అరుదైన కచిడి చేప పడింది. అది కూడా మగది. ఇంకేముంది వేలం పెడితే.. ఏకంగా 42,000 రూపాయలు పలికింది. దీంతో ఆ మత్స్యకారుడు ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఖరీదైన చేప తన వలకు చిక్కడంతో మత్స్యకారుడి పంట పండినట్టయింది.
మగ కచిడి చేప ఉదరభాగంలో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అందుకే ఈ చేపకు మార్కెట్లో మంచి డిమాండ్. వ్యాపారులు దీన్ని దక్కించుకునేందుకు పోటీ పడతారు. ఈ కచిడి చేపను గోల్డెన్ ఫిష్ అని కూడా పిలుస్తుంటారు. ఆపరేషన్ తర్వాత వైద్యులు కుట్లు వేసే దారాన్ని వీటి నుంచే తయారు చేస్తారు. చేప పొట్టభాగం నుంచి తయారుచేసే ఈ దారం సమయం గడిచే కొద్దీ శరీరంలో కలిసిపోతుంది. ఇక ఖరీదైన వైన్ తయారు చేసే పరిశ్రమల్లోనూ కచిడి చేపను యూజ్ చేస్తారు. అందుకే ఈ చేపకు ఇంత క్రేజ్.
కచ్చిడి చేపలను కలకత్తా, కేరళ, శ్రీలంకు ఎగుమతి చేస్తుంటామని చెబుతున్నారు వ్యాపారులు. ఈ చేపలు నిలకడగా ఒకే చోట ఉండవని అంటున్నారు మత్స్యకారులు. చాలా అరుదుగా వలకు చిక్కుతుంటాయని చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..