AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rayalaseema: రాయలసీమకు ఆ పేరు వచ్చి 97 సంవత్సరాలు.. అంతకుముందు..

బ్రిటిష్ కాలంలో "సీడెడ్" అని పిలవబడే రాయలసీమ ప్రాంతానికి ఈ పేరు 97 సంవత్సరాల క్రితం వచ్చింది. అసలు అంతకుముందు ఈ ప్రాంతానికి ఏ పేరు ఉండేది.. ఇందులోని ఏయే ప్రాంతాలు ఇతర ప్రాంతాల్లో కలిశాయి వంటి ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం పదండి..

Rayalaseema: రాయలసీమకు ఆ పేరు వచ్చి 97 సంవత్సరాలు.. అంతకుముందు..
Rayalaseema
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Nov 20, 2025 | 12:45 PM

Share

బ్రిటిష్ కాలంలో సీడెడ్ అని పిలవబడే రాయలసీమ ప్రాంతానికి ఈ పేరు వచ్చి తాజాగా 97 ఏళ్లు పూర్తయింది. 1928 నవంబర్ 17, 18న నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలలో రాయలసీమ అనే పేరును ప్రతిపాదించి ఆమోదించారు. అంతకుముందు దత్త మండలాలుగా పిలవబడే ఈ ప్రాంతానికి కొత్తగా రాయలసీమ అనే పేరు వచ్చింది.. అప్పటి నుంచి ఇప్పటివరకు రాయలసీమగా పిలవబడుతుంది.

రాయలసీమ అంటే ఇది ఒక ఫ్యాక్షన్ ఏరియా అని అందరూ ఠక్కున చెప్పేస్తారు. అది సినిమాల ప్రభావమో ఏమో తెలియదు గానీ రాయలసీమ ఫ్యాక్షన్ గడ్డగా పేరు తెచ్చుకుంది. అయితే అసలు ఈ రాయలసీమకు ఆ పేరు ఎందుకు వచ్చింది..? ఎప్పుడు వచ్చింది అనే వివరాల్లోకి వెళితే మొదట ఈ ప్రాంతాన్ని దత్త మండలం అని పిలిచేవారట. అంటే గతంలో 1792 వరకు ఈ ప్రాంతం అనేక రాజుల పాలనలో ఉండేది. 1792లో మూడో మైసూరు యుద్ధం ఒప్పందంలో భాగంగా ఈ ప్రాంతాన్ని నిజాం రాజులకు అప్పచెప్పినట్లు చరిత్ర చెబుతుంది.. ఆ తర్వాత 1800 వరకు రాయలసీమ నిజాం రాజుల పాలనలో ఉండేది. ఆ తరువాత టిప్పు సుల్తాన్ నిజాం రాజులపై దండెత్తి యుద్ధానికి వచ్చినప్పుడు బ్రిటిష్ వారి సహాయం కోరిన నిజాం రాజు ఈ ప్రాంతాన్ని వారికి దత్తత ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి . ఆ తరువాత దీనిని బ్రిటిష్ వారు అప్పటి మద్రాస్ రాష్ట్రంలో కలిపి రాయలసీమ ప్రాంతాన్ని సీడెడ్ అని పిలిచేవారట. అంటే ఒక ప్రాంతాన్ని అలాగే ఆ ప్రాంతంపై అధికారాన్ని బదిలీ చేయడం అని అర్థం.

బ్రిటిష్ వారు అలా సీడెడ్ అని పిలిచిన తర్వాత 1953 వరకు మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఈ ప్రాంతం 1953 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగమైంది అయితే గతంలో రాయలసీమలో ఉన్న బళ్లారి, తుముకూరు, దావనగేరే ప్రాంతాలు ప్రస్తుతం కర్ణాటకలో కలిశాయి .. అలాగే కర్నూలు జిల్లాలోని మార్కాపురం, కంభం, గిద్దలూరు ప్రాంతాలు ప్రకాశం జిల్లాలో కలిశాయి. ఇలా కొన్ని ప్రాంతాలు విడిపోగా మిగిలిన ప్రాంతాలను కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలుగా విభజించి ఈ ప్రాంతాన్ని రాయలసీమగా ఏర్పాటు చేశారు. మొదటిసారిగా ఈ ప్రాంతాన్ని 1928 నవంబర్ 17, 18 తేదీలలో జరిగిన ఆంధ్ర మహాసభలలో కడప జిల్లాకు చెందిన కోటిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో అనంతపురం జిల్లాకు చెందిన చిలుకూరి నారాయణరావు సీడెడ్‌కి బదులు ఈ ప్రాంతాన్ని రాయలసీమ అనే పేరుగా మార్చాలని ప్రతిపాదన చేసినట్లు ఆ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆ సభ 18వ తేదీన ఆమోదించినట్లు చెబుతారు.. ఇది అసలు రాయలసీమకు ఈ పేరు వచ్చిన కథ. ఏది ఏమైనా విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలకు అత్యంత ప్రీతిపాత్రంగా పిలవబడే ఈ ప్రాంతాన్ని రాయలు ఏలిన ప్రాంతంగా గుర్తించి శ్రీకృష్ణదేవరాయలకు అత్యంత ఇష్టమైన ఈ ప్రాంతానికి రాయలసీమ అనే పేరు పెట్టాలి అని ఆ సభలో ప్రతిపాదన చేసి ఆమోదించారు. అప్పటినుంచి సిడెడ్‌గా పిలవబడే ఈ ప్రాంతం రాయలసీమగా మారింది 97 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.