తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండల సభ్యుడిగా రాజమహేంద్రవరంకి చెందిన అక్కిన ముని కోటేశ్వరరావుకు అవకాశం దొరికింది. సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన ఆయన దశాబ్దాలుగా నగరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని స్వగ్రామంలో మూడేళ్ల క్రితం కోటి రూపాయల సొంత నిధులతో కైలాస భూమి నిర్మించారు. అనంతరం తన వాటర్ ప్లాంట్ గ్రామానికి అప్పగించారు. పద్మావతి అమ్మవారి ఆలయ పనులకు ఆయన విరాళం అందించాడు. ఏడాదిన్నర క్రితం రాజంపేటలో రూ.26 లక్షలతో వాటర్ ప్లాంట్ నిర్మించారు. చెన్నైలో సీఐ కోర్స్ మధ్యలో ఆపేసి వ్యాపార రంగంలోకి ఆయన అడుగు పెట్టారు. రఘుదేవపురంలో రూ.5కోట్లతో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం, వాటర్ ప్లాంట్ పూర్తి చేస్తున్న సమయంలో తిరుమల తిరుపతి బోర్డు సభ్యుడుగా అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటానని కోటేశ్వరరావు తెలిపారు. తన సేవలను సీఎం చంద్రబాబు నాయుడు గుర్తించడం సంతోషకరమైన విషయమన్నారు. స్వామికి సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో రాజమండ్రి కోటేశ్వరరావు నివాసంలోనే చంద్రబాబు కుటుంబ సభ్యులు 53 రోజులు ఉన్నారు.